Saturday, November 29, 2008

'థూ'గ్రవాదం - 'ఛీ'వ్రవాదం

ఇల్లు కాలి ఇల్లాలేడుస్తుంటే రా రమ్మని రంకు మొగుడు రాళ్ళేశాడంట.

రాయటానికి బాగోకున్నా రాయక తప్పలేదు. అలా ఉంది మా స్నేహితుని, మరికొందరి మాటలూ, చేష్టలూనూ. కడుపు రగిలిపోయింది. ముంబై లో ఉగ్రవాదుల దాడి జరిగి, ఇంగ్లాండు క్రికెటర్లు ఇంటి ముఖం పట్టారని వార్తని పేపర్లో చదివిన ఆ సదరు వ్యక్తీ, "అబ్బా! ఈ తీవ్రవాదులు ఇప్పుడే దాడి చేయాలా? ఈ రెండు వన్డే లూ మిస్సవుతున్నామే!" అన్నాడు. అంటే... ఈ రెండు వన్డేలూ ముగిసిన్తర్వాత దాడులు జరిగితే ఫర్వాలేదనా తన ఉద్దేశ్యం?

ముంబై లో మన సోదరుల జీవనం ఈ బాంబు దాడుల వల్లా, కాల్పుల వల్లా అస్తవ్యస్థం అవుతుంటే వన్డే క్రికెట్టు కావాల్సి వచ్చిందా? రేపు అదే కష్టం మనకూ వస్తే... అలాగే అనుకుంటామా? మన అమ్మా నాన్నలో, పెళ్ళాం పిల్లలో అలాగే ఏ 'బాజ్' హోటల్లోనో చిక్కుకుంటే కూడా అలాగే అనగలమా?

మొన్నటికి మొన్న హైదరాబాద్ లోనే దాడులు జరిగినై. అప్పుడు ఎంతమంది మరణించారో, ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో అందరికీ తెలుసు. ఈ మధ్యలోనే ఢిల్లీ లోనూ, గౌహతీలోనూ, జైపూర్లోనూ, బెంగళూరు లోనూ, అక్కడా... ఇక్కడా... అని ఏమున్నది? ఎక్కడైనా మేము ఉంటాం. ఎంతమంది ప్రాణాలనైనా తీస్తాం అని ఉగ్రవాదులు, తీవ్రవాదులూ, తమ పంజాలను విసురుతుంటే అమాయక ప్రజా వారి కోరల నుండీ తప్పించుకునే మార్గం లేక విలవిల లాడు తూనే ఉంది.

మన నాయకులు, ఏదో సినిమా లో కోటా "మేం కండిత్తన్నం" అన్నట్టు గానే ఖండిస్తూ ప్రసంగాలను చేస్తున్నారే కానీ ఖండ ఖండాలైన చిన్నారుల దేహాల్నీ, ప్రజల మనసుల్నీ ఏనాడైనా పట్టించుకున్నారా?

"మాకే న్యాయం జరగలేదిన్తవరకూ..." అంటూ రాహుల్ గాంధీ అన్నాడే కానీ న్యాయం జరిపించే పనిని తన యువ భుజ స్కంధాల మీద వేసుకుని, పూనుకుని, తీవ్రవాదాన్ని అంతం చేసే ప్రక్రియలో పాల్గొన్నాడా?

ఈ మధ్యనే (ఒక సంవత్సర కాలంలోనే) ఎన్నో నగరాల్లో దాడులు జరిగాయి. ఇంటిలిజన్స్ నివేదికలూ ఉన్నాయి. అయినా మన ప్రభుత్వం కళ్లు తెరవలేదు. తెరచి నిజం చూడలేదు. ఎంత సేపూ, ప్రతిపక్షాలని ఎలా దెబ్బతీయాలా అనే ఆలోచనే కానీ, దెబ్బ తింటున్న ప్రజల హృదయాల్నీ, దేహాల్నీ బాగుచేయాలనే ఆలోచనా సాలోచనా లేదు. ఉన్నదల్లా ఓటాలోచనే. ఓటి ప్రభుత ఇది.

హిందూ ఉగ్రవాదం తయారైందని వ్యాఖ్యానించగలరు కానీ, దేశం లోకి భూ, వాయు, మార్గాలలోనే కాదు, జల మార్గాల నుంచీ చొచ్చుకుని రాగలం అనే ఆ 'ఛీ'వ్రవాదులని మాత్రం పసిగట్టలేదు. అలా చేస్తే ప్రజలు బాగుంటారు కదా. బాగుంటే తమని లక్క చేయరు కదా. అలా ఐతే తమకు ఓట్లుండవు కదా. సంతోషం గా ఉన్నా మనిషికి వేరెవరితోనూ అవసరం ఉండదు. కానీ మన నాయక వాయసాలకి జనం తో అవసరం. జనం వారి మాటలని వినేది కష్టాలలో ఉన్నప్పుడే. అందుకే ఏ నాయకుడూ ఈ రోజుల్లో జనాలు సుఖం గా ఉండాలనుకోవటం లేదు. ఎంత సేపూ మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అంటారే కానీ, మీ ధన మాన ప్రాణాలని కాపాడుతాం అని ఏ రోజూ చెప్పరు.

జనం కూడా ఏదైనా మ్యాచి ఈ రోజు వస్తే చాలు, ఈ హీరోయిను ఎలా తిరుగుతున్నది, నా కడుపు చల్లగా ఉంటే చాలు, ఎవదేలా చస్తే నాకెందుకు? అనే భావనలతో ఉంటున్నారు కానీ సమైక్య భావాలని కూడా గట్టుకుని కనీసం నాయకులని నిలేద్దాం అనే ఆలోచన కూడా లేకున్నారు.

ఎంత సేపూ, హిందూ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం, అనే కానీ, తీవ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు. అనే నిజాన్ని గుర్తించరు. మనలో ఉన్న లోపాలే మనలని కబళిస్తున్నాయనే కనీసపు స్పృహ లేకుండా ఆ మతం వారు మమ్మల్ని చంపారు కనుక మేమూ వారిని చంపుతామనే భావజాలాన్ని పెంచుకుని, సమస్యని జటిలం చేస్తున్నారే కానీ పరిష్కార మార్గాలని ఆలోచించటం లేదు.

మన కోసం ఎందఱో జవానులు ఈ రోజున తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడి ఆ తుచ్చులని మట్టు పెట్టారు. వారిని సేబాషందాం. కానీ మనం మాత్రం ఏ మాత్రం వీర్యం లేకుండా ఏదో నడిచి పోతే చాలు అనుకుందాం. మనిషికి కావలసినది ఆలోచన. అంతే కానీ మూక మనస్తత్వం, ఏ ఆలోచనా లేని వ్యక్తిత్వం కాదు.

క్రికెట్టు కన్నా మనుషుల ప్రాణాలే మిన్న అని చెప్పిన కెవిన్ పీటర్సన్ నయం. ధనమెంతున్నా జనం లేని దేశమేనాడూ బాగు పడదు. ప్రజల ప్రాణాలని కాపాడలేని ప్రభుత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అందుకే ప్రజలే కళ్లు తెరవాలి ఆలోచించాలి. ఒక rational దృక్పథాన్ని అలవరుచుకుని తమని తామే ఎలా కాపాడు కోవాలని యోచించాలి. ఆట ఈరోజు కాకుంటే రేపు చూడొచ్చు. ప్రాణాలు ఈ రోజు పోతే రేపు రావు. జనహితం కానిదేదైనా మాంసపు ముక్కలో పడ్డ విత్తు లాంటిదే. కుళ్ళటమే కానీ, మొలకెత్తదు.

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP