Friday, June 26, 2009

ఉప్మా యత్ర సాదృస్య... కాళిదాసుని పట్టుకున్న వాళ్ళకి వంద మొహరీలు.




"దేశ భాషలందు తలుగు లెస్స" అని ఆంద్ర భోజుడు అన్నాడు. బాంది. కానీ తెలుగు టిఫిన్ లందు ఉప్మా లెస్స అంటే నేనూరుకోను. ఊరుకోవచ్చేమో! ఉప్మా లెస్ కదా. :-)

ఆ మధ్యెప్పుడో క్రాంతి గారి ఉప్మా పురాణం టపా చదివి బహు బాగు అనుకున్నాను. నేనూ ఉప్మా గురించి వ్రాయాలి అనుకున్నాను. అశ్శ్రీహరిని పూజించకు. తలవకు. అంటూ ప్రహ్లాదుడిని బెదిరించినా హిరణ్యకశిపుడు తన ద్వేషం వల్ల ఆ శ్రీహరినే తలంచినట్లు నా ద్వేషం వల్ల ఉప్మాని తలంచక తప్పట్లేదు. ఉప్మాగురించి వ్రాయటానికి అంత సీను ఉందా! అనుకుంటుండగా క్రాంతి గారి వల్ల నా భ్రాంతి వదిలిపోయింది.

"చంటీ టిఫిన్ చేసి వెళ్ళు," అని వదిన అంటుంది. నేను, "టిఫిన్ ఏమిటి వదినా" అంటాను. సమాధానం "ఉప్మా." దేవుడా ఆరోజు నాకు టిఫిన్ ప్రాప్తం లేదు అనుకుంటూ ఆకలిగా లేదు అంటాను. ఆ పూటకి మధ్యాన్నం ఒంటి గంట దాకా మాడాల్సిందే. ఉన్న ఉప్మా చాలదన్నట్టు, ఇంక గోధుమ రవ్వతో చేస్తారు. దానికన్నా ఎండు గడ్డే నయం.

పెళ్ళిళ్ళలో తొందరగా అవుతుందని ఉప్మా చేస్తారు. అదో నరకం. నన్ను తీసుకెళ్లినోళ్ళు (అప్పుడు చిన్న పిల్లాడినే), "తినూ బాగుండదు" అంటారు. మరి బాగుందనిది ఎలా తినేది. ఈ విషయమే మా బాబాయిని ఒకసారి అడిగా. వేలు చూపిస్తూ నోరు మూసుకో అన్నాడు. ఈ తుక్కుప్మాకి తోడూ బెదిరింపులోకటి. హ్హుఁ. ఒకసారి మా బంధువుల ఇంటికి వెళ్లాను. అక్కడ వెరైటీ టిఫిన్ అన్టూ అదేదో పెట్టారు. పైకి రొట్టెలాగా ఉంది. హా ఛస్తి. లోపల ఉప్మా ఉంది. ఇవాళ ఉపవాసం ఉంది మరిచిపోయాను అని తప్పించుకున్నాను.

వీటికితోడు పెసరట్టొకటి. రెండూ రెండే. కరటక దమనకుల్లాగా. ఒక్కోసారి నా చేత టిఫిన్ మానిపించాలనేమో ఇంట్లో కక్ష కట్టినట్లు ఉప్మా చేస్తారు. మళ్ళీ దాన్లో టమాటా. వాక్.

ముంబై మోడల్ లాగా బొంబాయి రవ్వుప్మా,
నమిత లాగా ఇడ్లీ ఉప్మా,
వాన పాములల్లె సేమ్యా ఉప్మా,
ఎస్ ఎస్ రాజ మౌళి సినేమాలో రక్తం లాగా టమాటా బాత్
,

పేర్లెన్నో పెట్టి నా ప్రాణం తీయక పొతే ఎందుకీ చెత్త. ఈ ఉప్మా ప్రేమికులకి ఎందుకో అదంటే అంత ఇది. బహుశా బద్ధకం ఉన్న వాళ్ళకి ఉప్మా నచ్చుతుందేమో. చేసుకుంటాం వీజీ కదా.

ఉపమాలంకారం లాగా ఉప్మాని ఎవరు బడితే వారు చేసేస్తుంటారు. బహుశః కాళిదాసే దాన్ని మొదలెట్టి వెళ్ళాడేమో! కాళిదాసు కవిత్వం లాగా చిరస్థాయిగా నిలిచి పోయింది. బాడ్ లక్.

ఉప్మాసంహారం: ఆ మధ్య శ్రీ శైలం వెళ్లి వస్తూ మా పిన్నీ వాళ్ళింట్లో దిగాము. పగలంతా క్రికెట్ ఆడి వస్తూ సాయంత్రానికి ఆకలేస్తోందని టిఫిన్ చేయమని అడిగాం. సరేనంటూ తను ఉప్మా పెసరట్టు చేసింది. తినను బాబోయ్ అన్నా బలవంతంగా పెట్టిచ్చింది. తినకపోతే ఢామ్. తిన్నా ఢామ్. ఆకలి తో అలమటించి దిక్కులేని చావు చచ్చే కన్నా ఉప్మా చావే నయం అని డిసైడ్ అయి తప్పదన్నట్లు సోక్రటీస్ విషం త్రాగినట్లు ఒక ఎక్స్ప్రెషన్ పడేస్తూ నోట్లో ఒక ముక్క పెట్టుకున్నాను. చిత్రం. తేజా సినేమా హిట్ అయినట్లు అది నాకు నచ్చింది. ఇంకోటి ఇంకోటి అంటూ ఐదు తిన్నాను. కలయో లేక వైష్ణవ మాయయో అనుకుంటూ రేపూ ఇదే చెయ్యి అని అడిగిమరీ తిన్నాను. అయ్యో ఇంత మంచి టిఫిన్ని ఇంతకాలం ఎందుకొదిలేశానో కదా అనుకుంటూ ఇంటికెళ్ళాక అమ్మని ఉప్మా పెసరట్టు చేయమన్నాను. అమ్మ ఆశ్చర్య పోతూ చేసింది. ఆత్రంగా నోట్లోక్క ముక్క పెట్టుకున్నాను. నా బాధ వర్ణనాతీతం. తట్టుకోలేక అమ్మా అన బోయాను. కానీ ఉప్మా ఎఫ్ఫెక్ట్ కి "ఉప్పమ్మా" అన్నాను. అంతే అమ్మ, ఉప్పుతక్కువేమో అని అట్టు తెరిచి ఉప్మాలో కొంచం ఉప్పేసికలిపి నా నోట్లో పెట్టింది.

ఇన్ఫెరెంస్: మీరే తేల్చండి.

నా మాట: ఉప్మా ప్రియులారా! మనది ప్రజాస్వామ్య దేశం. ఉప్మా నచ్చినోల్లు తినండి కానీ వద్దన్న వాళ్ళకి మాత్రం పెట్టకండి.ఉప్మా వ్యతిరేక సంఘం ఎవరు పెట్టినా నేను బయట నుండీ మద్దతు ఇస్తాను. లోపలికి రాను. ఎందుకంటే సంఘం పేరులో ఉప్మా ఉందిగా!

సో, సో సో!

సత్యమేవ జయతే!

ఉప్మయేవ భయతే. ala అశ్వద్ధామ హతః కుంజరః

గమనిక: నేను బ్లాగుల్లోకి వచిన కొత్తల్లో రాసుకున్న టపా ఇది. దాన్ని పూర్తిగా మూసేద్దామని కొన్ని మంచి టపాలని ఇక్కడ పెట్టె ప్రయత్నం. ఇక మిగతావన్నీ బ్యాక్ డేట్స్ తో వస్తాయి.

Read more...

ప్రేమ రచన



ధ్వంస రచన జరిగే కాలాన ప్రేమ రచనకు ఆశేదీ?

ఉరుకు పరుగుల లోకాన ప్రేమాస్వాదనకు చోటేది?

దూరమైన హృదయాల మధ్య బిగి కౌగిలికి తావేదీ?

Read more...

Thursday, June 25, 2009

’సత్యాన్వేషి’కి ఏడాది!

నేను బ్లాగులలోకి వచ్చి ఏడాది పూర్తై పోయి నెల దాటిపోయింది కూడా.


సత్యమేవ జయతే!’ అనే బ్లాగుతో మొదలెట్టి, కొన్ని కొన్ని వ్యక్తిగత దాడుల వల్ల, ఆ ఐడీనే వదిలేసి, సరికొత్తగా ’The Inquisistor - సత్యాన్వేషి’ అనే ఈ బ్లాగుని మొదలెటింది గత అక్టోబర్లో.

నాకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టిన బ్లాగు "వింబుల్డన్ విలేజ్" అయితే, కాస్తో కూస్తో సినీ సినీ పరిఙ్ఞానం ఉన్నదన్న నమ్మకాన్ని కలిగించింది "నవతరంగం". ఇప్పటికైతే నాకు వీటిలో వ్రాస్తుంటే చాలా satisfaction గా ఉంటుంది.

టెన్నిస్ గురించే కాకుండా విజేతల మనస్తత్వాన్ని గురించి కూడా విశ్లేషించే వింబుల్డన్ విలేజ్ అలా అలా సాగుతూ కాస్త కుంటి నడకన ఉంది. ఐనా దానిని మూత పడేయను. వీలున్నప్పుడల్లా ఏదన్నా వ్రాస్తూనే ఉన్నాను.

"విజయ విశ్వనాథం" టపాతో మొదలెట్టి, ఈ మధ్యనే Michaelangelo Antonioni గురించి వ్రాసిన టపా వరకూ పడుతూ లేస్తూనే అయినా హుషారుగానే, పర్పస్‍ఫుల్‍గానే, (మంచి టపాలనే వ్రాశాను. అంత త్వరగా అర్థం కావు అనే కంప్లైంట్ తప్ప) మంచి మంచి వ్యాసాలతోనే నడిచింది నా నవతరంగ ప్రయాణం. నాకు వీలైనన్ని రకాలుగా అన్ని రకాల వస్తువులనీ తీసుకుని వ్రాశాను.

"విజయ విశ్వనాథం" is my original work, where I'm studying the psychological and philosophical motives behind certain characters of K. Vishwanath's Quadrulogy of Gurus. (శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణ కమలం, స్వాతి కిరణం).

వాటి గురించి నవతరంగం లేదా, నా బ్లాగుల లిస్ట్ లో "విజయ విశ్వనాథం" పేరుతో ఉన్న నా బ్లాగులోనైనా చదవవచ్చు.

ప్రపంచ సినిమా, రివ్యూలు, (ఒక తెలుగు, ఒక హిందీ, ఒక కొరియన్), ఒక ప్రముఖ దర్శకుని గురించీ (ప్రశ్నాంటోనియోనీ), ఒక ఇటాలియన్ సినిమా, ఇంగ్లీషు సినిమా ల పైన విశ్లేషణ. ఇదీ నవతరంగంలో నా సోది. త్యాగయ్య గురించి వ్రాసిన టపా నాకు భాషా పరంగా, విషయ పరంగా నాకు ఎమ్తో తృప్తినిచ్చిన టపా. ఇక సుమంగళి గురించి వ్రాసిన టపా కాస్త కల్లోలాన్నే రేపింది.


డమ్మీ - హార్డువేర్ ఇంజినియర్ ఎక్కువ వ్రాయకపోయినా (ఇప్పుడైనా పునరుద్ధరించాలి) చదివించే వ్యంగ్య టపాలే ఉన్నాయి.



సుజాత గారితో మొదలెట్టిన నరసరావుపేట్రియాట్స్ హిట్టయినట్టుగానే ఉంది. మమ్మల్ని చూసి కొందరిలో చలనం వచ్చింది.



నా రొమాంటిక్ బ్లాగ్ ధీర సమీరే... యమునాతీరే! ఉన్నవి రెండే అయినా ఆణిముత్యాల్లాంటి టపాలే.



ఇక ఇప్పుడు ఈ మధ్యనే టపాలు మొదలై నెలలోపే రెండు వేల క్లిక్కులని చవిచూసిన నా మరో ఫావొరిట్ బ్లాగు... BOOKS AND GALFRIENDS.



ఇలా ఇలా ఏదో నా మానాన నేను వ్రాసుకుని పోయినా, సహృదయులైన తెలుగు బ్లాగర్లు మరీ ఎక్కువ కాకపోయినా కాస్తన్నా వారి విలువైన సమయాన్ని నాకోసం కేటాయించి నన్ను ప్రోత్సహించారు. అందరికీ నా సవినయ కృతఙ్ఞతాభివందనాలు.




కొందరు మిత్రులని కూడా నేను సంపాదించుకున్నాను. కాస్తంత గుర్తింపునీ పొందాను ఇక్కడ.ఇదోరకం తృప్తి.



దాదాపూ నూట ఇరవై పైన టపాలు, ఐదు వందల వ్యాఖ్యలు, (నవతరంగం మినహాయించి) ఏడెనిమిది మంది స్నేహితులు, ఇద్దరు ముగ్గురు సద్విమర్శకులు. ఇవీ నేనిక్కడ పోగేసుకున్న ఆస్తులు.


ఒక పన్నెండు వేల మంది పైన నా వ్రాతల్ని చదివారు.



ఈ సందర్భంగా నాకు తెలుగు లిపిని ఎలా వాడాలో చూపిన రామ శాస్త్రి గారికీ, నాకు నవతరంగాన్ని పరిచయం చేసిన కొత్త పాళి గారికీ నేను ఎప్పుడూ కృతఙ్ఞుడనై ఉంటాను.


అలాగే మా పేటోళ్ళు మామూలోళ్ళు కాదు సుమీ. వాళ్ళకీ నా ధన్యవాదాలు.

I never felt I'm local, I always think of me as a universal person ;-). So, I thank everybody.

నా అన్ని బ్లాగుల వివరాలూ సైడ్ బార్‍లో ఉన్నాయి.

Read more...

Thursday, June 18, 2009

అతను ఆమెను చూశాడు

అతను ఆ పిల్లను చూశాడు.

చాలా కాలం నుంచీ చూస్తూనే ఉన్నాడు. అలాగే ఇవాళా చూశాడు. ఇందాకటి నుంచీ చూస్తూనే ఉన్నాడు. వాచీలో
సెకన్ల ముల్లు పరిగెడుతూనే ఉంది. మాటి మాటికీ అతని చూపులు ఆ పిల్ల వైపు పరిగెత్తినట్లు.

"సార్! ఎడిషనల్ షీట్," అడిగింది ఆ పిల్ల. ఈ లోకంలోకి వచ్చిన అతను నవ్వుకున్నాడు. తన ఆలోచనలకి.
.
.
.
.
.
.
.
.

ఇంట్లో భార్య కానీ ఇక్కడ కాదుగా.  :)

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP