Friday, June 26, 2009

ఉప్మా యత్ర సాదృస్య... కాళిదాసుని పట్టుకున్న వాళ్ళకి వంద మొహరీలు.




"దేశ భాషలందు తలుగు లెస్స" అని ఆంద్ర భోజుడు అన్నాడు. బాంది. కానీ తెలుగు టిఫిన్ లందు ఉప్మా లెస్స అంటే నేనూరుకోను. ఊరుకోవచ్చేమో! ఉప్మా లెస్ కదా. :-)

ఆ మధ్యెప్పుడో క్రాంతి గారి ఉప్మా పురాణం టపా చదివి బహు బాగు అనుకున్నాను. నేనూ ఉప్మా గురించి వ్రాయాలి అనుకున్నాను. అశ్శ్రీహరిని పూజించకు. తలవకు. అంటూ ప్రహ్లాదుడిని బెదిరించినా హిరణ్యకశిపుడు తన ద్వేషం వల్ల ఆ శ్రీహరినే తలంచినట్లు నా ద్వేషం వల్ల ఉప్మాని తలంచక తప్పట్లేదు. ఉప్మాగురించి వ్రాయటానికి అంత సీను ఉందా! అనుకుంటుండగా క్రాంతి గారి వల్ల నా భ్రాంతి వదిలిపోయింది.

"చంటీ టిఫిన్ చేసి వెళ్ళు," అని వదిన అంటుంది. నేను, "టిఫిన్ ఏమిటి వదినా" అంటాను. సమాధానం "ఉప్మా." దేవుడా ఆరోజు నాకు టిఫిన్ ప్రాప్తం లేదు అనుకుంటూ ఆకలిగా లేదు అంటాను. ఆ పూటకి మధ్యాన్నం ఒంటి గంట దాకా మాడాల్సిందే. ఉన్న ఉప్మా చాలదన్నట్టు, ఇంక గోధుమ రవ్వతో చేస్తారు. దానికన్నా ఎండు గడ్డే నయం.

పెళ్ళిళ్ళలో తొందరగా అవుతుందని ఉప్మా చేస్తారు. అదో నరకం. నన్ను తీసుకెళ్లినోళ్ళు (అప్పుడు చిన్న పిల్లాడినే), "తినూ బాగుండదు" అంటారు. మరి బాగుందనిది ఎలా తినేది. ఈ విషయమే మా బాబాయిని ఒకసారి అడిగా. వేలు చూపిస్తూ నోరు మూసుకో అన్నాడు. ఈ తుక్కుప్మాకి తోడూ బెదిరింపులోకటి. హ్హుఁ. ఒకసారి మా బంధువుల ఇంటికి వెళ్లాను. అక్కడ వెరైటీ టిఫిన్ అన్టూ అదేదో పెట్టారు. పైకి రొట్టెలాగా ఉంది. హా ఛస్తి. లోపల ఉప్మా ఉంది. ఇవాళ ఉపవాసం ఉంది మరిచిపోయాను అని తప్పించుకున్నాను.

వీటికితోడు పెసరట్టొకటి. రెండూ రెండే. కరటక దమనకుల్లాగా. ఒక్కోసారి నా చేత టిఫిన్ మానిపించాలనేమో ఇంట్లో కక్ష కట్టినట్లు ఉప్మా చేస్తారు. మళ్ళీ దాన్లో టమాటా. వాక్.

ముంబై మోడల్ లాగా బొంబాయి రవ్వుప్మా,
నమిత లాగా ఇడ్లీ ఉప్మా,
వాన పాములల్లె సేమ్యా ఉప్మా,
ఎస్ ఎస్ రాజ మౌళి సినేమాలో రక్తం లాగా టమాటా బాత్
,

పేర్లెన్నో పెట్టి నా ప్రాణం తీయక పొతే ఎందుకీ చెత్త. ఈ ఉప్మా ప్రేమికులకి ఎందుకో అదంటే అంత ఇది. బహుశా బద్ధకం ఉన్న వాళ్ళకి ఉప్మా నచ్చుతుందేమో. చేసుకుంటాం వీజీ కదా.

ఉపమాలంకారం లాగా ఉప్మాని ఎవరు బడితే వారు చేసేస్తుంటారు. బహుశః కాళిదాసే దాన్ని మొదలెట్టి వెళ్ళాడేమో! కాళిదాసు కవిత్వం లాగా చిరస్థాయిగా నిలిచి పోయింది. బాడ్ లక్.

ఉప్మాసంహారం: ఆ మధ్య శ్రీ శైలం వెళ్లి వస్తూ మా పిన్నీ వాళ్ళింట్లో దిగాము. పగలంతా క్రికెట్ ఆడి వస్తూ సాయంత్రానికి ఆకలేస్తోందని టిఫిన్ చేయమని అడిగాం. సరేనంటూ తను ఉప్మా పెసరట్టు చేసింది. తినను బాబోయ్ అన్నా బలవంతంగా పెట్టిచ్చింది. తినకపోతే ఢామ్. తిన్నా ఢామ్. ఆకలి తో అలమటించి దిక్కులేని చావు చచ్చే కన్నా ఉప్మా చావే నయం అని డిసైడ్ అయి తప్పదన్నట్లు సోక్రటీస్ విషం త్రాగినట్లు ఒక ఎక్స్ప్రెషన్ పడేస్తూ నోట్లో ఒక ముక్క పెట్టుకున్నాను. చిత్రం. తేజా సినేమా హిట్ అయినట్లు అది నాకు నచ్చింది. ఇంకోటి ఇంకోటి అంటూ ఐదు తిన్నాను. కలయో లేక వైష్ణవ మాయయో అనుకుంటూ రేపూ ఇదే చెయ్యి అని అడిగిమరీ తిన్నాను. అయ్యో ఇంత మంచి టిఫిన్ని ఇంతకాలం ఎందుకొదిలేశానో కదా అనుకుంటూ ఇంటికెళ్ళాక అమ్మని ఉప్మా పెసరట్టు చేయమన్నాను. అమ్మ ఆశ్చర్య పోతూ చేసింది. ఆత్రంగా నోట్లోక్క ముక్క పెట్టుకున్నాను. నా బాధ వర్ణనాతీతం. తట్టుకోలేక అమ్మా అన బోయాను. కానీ ఉప్మా ఎఫ్ఫెక్ట్ కి "ఉప్పమ్మా" అన్నాను. అంతే అమ్మ, ఉప్పుతక్కువేమో అని అట్టు తెరిచి ఉప్మాలో కొంచం ఉప్పేసికలిపి నా నోట్లో పెట్టింది.

ఇన్ఫెరెంస్: మీరే తేల్చండి.

నా మాట: ఉప్మా ప్రియులారా! మనది ప్రజాస్వామ్య దేశం. ఉప్మా నచ్చినోల్లు తినండి కానీ వద్దన్న వాళ్ళకి మాత్రం పెట్టకండి.ఉప్మా వ్యతిరేక సంఘం ఎవరు పెట్టినా నేను బయట నుండీ మద్దతు ఇస్తాను. లోపలికి రాను. ఎందుకంటే సంఘం పేరులో ఉప్మా ఉందిగా!

సో, సో సో!

సత్యమేవ జయతే!

ఉప్మయేవ భయతే. ala అశ్వద్ధామ హతః కుంజరః

గమనిక: నేను బ్లాగుల్లోకి వచిన కొత్తల్లో రాసుకున్న టపా ఇది. దాన్ని పూర్తిగా మూసేద్దామని కొన్ని మంచి టపాలని ఇక్కడ పెట్టె ప్రయత్నం. ఇక మిగతావన్నీ బ్యాక్ డేట్స్ తో వస్తాయి.

5 comments:

మరువం ఉష June 26, 2009 at 6:54 AM  

ఉప్మా నాకూ విరోధే. పెళ్ళిళ్ళు అందుకే నా చావుకొచ్చేవి. ఒకసారి నాన్న గారు పంతంగా కూరిన ఉప్మా బుగ్గల్లో దాయగామిగిలింది గొంతులోనొక్కుంచి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనయ్యాకా, మా నానమ్మ గగ్గోలుతో నాకు ఉప్మానుండి విముక్తి లభించింది. అయినా వండకా, తినకా అపుడపుడూ తప్పదు.

జ్యోతి June 26, 2009 at 10:26 AM  

ఉప్మా అంటే అంతగా ఇష్టం లేదు కాని. ద్వేషం మాత్రం లేదు. మీరేంటి ఉప్మా మీద ద్వేషంతో అన్ని అప్పు తచ్చులు.. ఉప్మాలో ఇసుకలా తగులుతున్నాయి. సరిదిద్దండి ఆచార్యగారు..

సుజాత వేల్పూరి June 26, 2009 at 11:54 AM  

ఉప్మా ఒక్కటీ తినలేం గానీ ఉప్మా పెసరట్టు ఓలాంధ్రా ఫేమస్ తెలుసా!నా టిఫ్న్ల లిస్టులో చివారఖర్న ఉండేది ఉప్మా అని నా బ్లాగులో కూడా ఓసారి చెప్పాను.

ఉషగారూ,
ఈ మధ్య పెళ్ళిళ్లలో కొంచెం నయం, ఇడ్లీ, వడ లాంటివి సర్వ్ చేస్తున్నారు. ఇదివరలో ఇంకేమీ దొరకనట్లు బొంబాయి రవ్వ ఉప్మా నూనె ఓడుతూ! దాన్ని ఆకుల్లో పెట్టి సర్వింగూ! ఛ, ఎవరింటిన్నా పెళ్ళికి వెళ్లాలంటే ముందు ఉప్మా దెబ్బతో భయపడి మానేయాల్సిన పరిస్థితి ఉండేది.

Kathi Mahesh Kumar June 26, 2009 at 9:08 PM  

"ఉప్మాసంహారం" cherry on the cake కాదుకాదు ఉప్మామీద జీడిపప్పు.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP