Tuesday, October 18, 2011

సంధ్యా కవిత:

P O E T R Y – ఓ హృద్యమైన కవిత

vlcsnap-2011-10-13-14h19m26s30
పక్షులు కిలకిలారావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. పరిమళ భరితమైన మలయ మారుతం లేలేత చిగురాకులను పలుకరిస్తూ, ఊసులాడుతున్నది. నీలి రంగు తివాచీలా ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని తనలో చూపెడుతున్న ఆ సరస్సు ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నది. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి హొయలుబోతున్నది. స్వప్న సీమలా ఉన్న ఆ వనము సంతోషానికి చిరునామాలా ఉన్నది. అలాంటి చోట ఎవరికైనా కవిత్వం ఉప్పొంగి వస్తుంది. కానీ ఒక విషయం. ఈ రోజుల్లో కవిత్వమంటే ఎందరికి ఆసక్తి ఉంది? ఎద ఉప్పొంగి ప్రవహించే భావాలను ఎంత మంది అక్షరాల రూపంలోకి మార్చి అనుభూతింపజేయ గలుగుతున్నారు? ఏవీ ఒకప్పటి కవిత్వపు సొగసులు? ఏవీ సరియయిన కవితా సంకలనాలు? గుండెను చెమ్మగిల్లేలా చేయగలిగే ఆ మాటల మంత్రాలేవి? ప్రస్తుత ప్రపంచంలో  గొప్ప కవి ఎవరు అంటే దశాబ్దాల క్రితంలా ఏ Wordsworth లా లేదా అలాంటి పేరు ఎందరు చెప్పగలరీ రోజుల్లో? కవిత్వాన్ని అనుభూతి చెంది, ఆస్వాదించ గల యువత ఎక్కడ?
కవిత్వం ఔడ్డేటెడ్!
కవిత్వం సరే! కమ్మని అనుబంధాలేవీ? ఆ అనుబంధాల ఊసులేవీ? తాతయ్యా, నాయనమ్మల కబుర్లేవి? అమ్మమ్మ ప్రేమగా పంచే తినుబండారాల గుబాళింపులేవి?
సున్నితమైన అనుబంధాలు ఔడ్డేటెడ్!
కనుమరుగైపోతున్న మానవ సంబంధాలను, అంతకు ముందే ఆ ప్రమాదంలో పడ్డ కవిత్వంతో పోలుస్తూ, కొరియెన్ దిగ్దర్శకుడు లీ చాంగ్-డాంగ్ తీసిన అద్భుత దృశ్యకావ్యమే ‘పోయెట్రీ’. ఒక చిత్రం చూడండి. పోయెట్రీ… పోయె ట్రీ. వెళ్ళిపోయిన వృక్షం. ఒకప్పుడు మహా వృక్షంలా వెలిగిన కవితా సాహితి ఇప్పుడు కనుమరుగవుతున్నదా? అన్న ప్రశ్నను, మాన సంబంధాలకు జతగలిపి, లోతైన ప్రశ్నలు రేకెత్తిస్తూ సాగుతుందీ సినిమా.
ఏ సినిమాకైనా మొదటి పది నిముషాలు కీలకం. కథ వాతావరణం లోనికి తీసుకుని వెళ్ళేందుకు. ఈ సినిమా ప్రారంభ దృశ్యం ‘హన్’ నదీ జలాల మీద. మొదట దర్శకుడు మనకు నీటిని చూపుతాడు. అలా ప్రవహించే నదీ జలాల సవ్వడులు వింటూ, ఆ నీలి నీటి ప్రవాహాన్ని చూస్తూ, ఒడ్డున ఉన్న పచ్చటి చెట్లను చూస్తూ మనం ప్రయాణం సాగిస్తుండగా కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వారి ఆటల ఊసుల్లో మనమున్న సమయంలో దూరంగా నీటిలో ఏదో కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. దగ్గరకు రాగా, రాగా అది ఒకమ్మాయి శవం!
కథః ఈ సినిమా కథను చెప్పటం చాలా కష్టం. ఎంత కష్టమంటే మానవ హృదయపు లోతులను కనుగొనే ప్రయత్నమంత.
డైవర్సీ అయిన కూతురు వదిలి వెళ్ళిన మనుమడిని భరిస్తున్న మి-జా అనే వృద్ధురాలు జ్ఞాపక శక్తి తగ్గుతోందని గ్రహిస్తుంది. క్రమంగా తన చేయి తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండటం, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుండటంతో ఇక తప్పదనుకుని డాక్టర్ను సంప్రదించటంతో అసలు కథ మొదలవుతుంది. రంగు రంగుల పూల పూల స్కర్ట్స్ వేసుకునే మి-జా, ఒక చిన్న పిల్లలా తమాషాగా సరదా అయిన వ్యక్తి. గవర్నమెంటిస్తున్న సబ్సిడీల మీద బ్రతుకు బండిని లాగిస్తుంటుంది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా పక్షవాతంతో బాధ పడుతున్న మరొక వృద్ధుడికి నానీలా పని చేస్తూ, అతను ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతుంటుంది. అలాంటి పరిస్థితులలో ఉన్న మి-జా కు కవిత్వమంటే ఉన్న ఆసక్తి వల్ల దగ్గరలోనే ఉన్న లోకల్ కమ్యూనిటీ సెంటర్లో జరుగుతున్న పోయెట్రీ క్లా౨సుల్లో చేరుతుంది. అక్కడ కవిత్వం వ్రాయటం గురించి కన్నా, అనుభూతులను గమనించటం, వాటిని మాటల రూపంలో పెట్టటం ఎలా అన్న దానిమీద చర్చ నడుస్తున్న సమయంలో మి-జా అక్కడ అడుగు పెడుతుంది. ఇలా ఎలాగోలా తన జీవనాన్ని ఆనందంగానే గడుపుతున్న ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు మనవడి స్నేహితుని తండ్రి వల్ల వస్తుంది.
ఒక రోజు మి-జా తన కవిత్వపు క్లా౨సుకు వెళ్ళబోయే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆమె విషయం చెప్పి, క్లా౨సు ముగిశాక కలుద్దామని అంటుంది. చెప్పిన టైముకు వచ్చిన ఒకతనితో ఆమె వెళుతుంది. అప్పుడు అక్కడ మరో నలుగురు పరిచయమవుతారు.  వారు మి-జా మనుమడి స్నేహితుల తండ్రులు. హైస్కూలులో చదివే హీ-జిన్ అనే బాలికను ఆరు నెలల పాటూ రేప్ చేసి హింసిస్తారు. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఈ వివరాలన్నీ ఒక డైరీలో వ్రాసుకుని పెడుతుంది. అది పోలీసుల చేతికి అందితే తమ పిల్లలకు ప్రమాదమనీ, దాన్ని తప్పించాలంటే ఆ పిల్ల తల్లిని కన్విన్స్ చేసి కేసు ఉపసంహరించుకునేలా చెయ్యాలనీ, దాని కోసం అవసరమయితే ఆమెకు డబ్బునిచ్చి అయినా ప్రమాదం నుంచీ గట్టెక్కాలనీ చెప్తారు. తన మనుమడు కూడా ఈ వ్యవహారంలో ఉండటం మి-జాను బాధిస్తుంది. ఆ పిల్ల తల్లి వేదనను గ్రహించి తల్లడిల్లుతుంది. తన మనుమడు ఇందులో ఇరుక్కున్నాడని తెలిసినా సరియయిన న్యాయం జరగాలని, అందు కోసం తను కృషి చెయ్యాలని అనుకుంటుంది.
కథనం: చూడటానికి సాదా సీదాగా ఉన్న ఈ కథ లీ చాం-డాంగ్ చేతిలో పడటం వల్ల అద్భుతమైన సినిమాగా మారింది. సినిమా అన్నది దృశ్య మాధ్యమం. ఇక్కడ కథను మాటల్లో కాకుండా బొమ్మలలో చెప్పాలి. అలా కాకుండా మొత్తం మాటల రూపంలోనే లాగిస్తే అది డ్రామాకన్నా ఎక్కువేమీ కాదు. ఈ విషయం బాగా తెలిసిన అతి కొద్ది దర్శకులలో లీ ఒకడు. మొదటి సినిమా గ్రీన్ ఫిష్ మినహాయిస్తే మిగిలిన అన్నిటిలోనూ తనదైన ముద్రను వేస్తాడు. తెర మీద కనిపించే ప్రతి దృశ్యంలోనూ ఎన్నో విషయాలు. ఒక్క చిన్న వివరం కూడా అనవసరంగా ఉండదు. కథా, కథనాలు కలగలసి ఉండటం అతని సినిమాలలోని ప్రత్యేకత. ఈ సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు.
కథను దృశ్యాత్మకంగా చెప్పటమే కాదు. ప్రేక్షకుని తెలివి తేటల మీద గౌరవం ఉండటం కూడా లీ కలిగి ఉన్న సుగుణాలలో ఒకటి. అందుకే అనుకున్నదంతా గుమ్మరించ కుండా ప్రేక్షకుల ఆలోచనకు కూడా వదలివేస్తాడు. తెర మీద కనిపించే బొమ్మ ఎంత కథ చెపుతుందో, కనిపించని మన ఆలోచన కూడా అంతే స్పందనను మనలో కలుగజేస్తుంది. Th e ability to help the viewer to integrate his imagination with the pictures shown on the screen is of highest class. అలా చెయ్యగలగటమే లీ ను తన సమకాలికులలో ప్రత్యేకమైన వాడిగా నిలుపుతున్నది. విక్రమార్కుని కదన కౌశలాన్ని తలపించే కథన కౌశలంతో వీక్షకుణ్ణి కట్టి పడేస్తాడు లీ. సాధారణ పరి భాషలో చెప్పాలంటే లీ వన్నీ ఆర్టు సబ్జెక్ట్స్. అతని సినిమాలు కూడా. కానీ, అవన్నీ బాక్సాఫీసు దగ్గర కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. అలాంటి విలక్షణమైన దర్శకుడు కనుకనే లీ అంటే ప్రపంచ సినిమాలో గౌరవం.
ఈ సినిమాను మొదటి పది నిముషాలు కనుక ఓపిక చేసుకుని చూస్తే ఎలాంటి ప్రేక్షకుడైనా ఇక ముగిసే దాకా వదలడు. అమ్దుకేనేమో ఎన్నో చోట్ల ఈ సినిమా స్క్రీన్‍ప్లే కు అవార్డులొచ్చాయి.
నటీనటులు.: యాంగ్ మి-జా. ఒక్కసారి చూడగానే చిరకాల సన్నిహితత్వాన్ని కలిగించే పాత్ర. సినిమా ముగిశాక  చాలా రోజుల పాటూ వెంటాడుతుంది. అలాంటి పాత్రను సృష్టించటం దర్శకుని గొప్పదనమయితే, దాన్ని అంతే సమర్థవంతంగా పోషించి వీక్షకులను కట్టి పడేటం నటీనటుల గొప్పతనం. Yoon Jeong-hee. ఆరవ, ఏడవ దశకాలలో కొరియెన్ సినిమాను ఏలిన గొప్ప నటి. ఇరవై నాలుగుకు పైగా అత్యున్నత పురస్కారాలను పొందిన విదుషీమణి. పదహారేళ్ళ క్రితం తెర జీవితానికి స్వస్తి పలికి, విశ్రాంత జీవనం గడుపుతున్నది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.  ఒకానొక కాలంలో గొప్ప నటులుగా బాక్సాఫీసును దున్నేసిన వాళ్ళు చాలా కాలం గా౨ప్ తరువాత తెరమీదకు వస్తే, వారి నటనలో పాత వాసనలు ఉంటాయి. అవసరమైన దానికన్నా ఎక్కువగా మెలో డ్రామా పండిస్తారు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా నటించ లేరు. వారిదైన పాత తరహా నటనతోనే అలరించాలని చూస్తారు. అది తప్పు అనలేము కానీ, ఇబ్బంది కరమైన విషయమన్నది మాత్రం ఒప్పుకోవాల్సిందే. కానీ యూన్ జ్యాంగ్‍-హీ ఆ ఇబ్బందిని అధిగమించింది. చాలా సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోసింది. తెరపైన మనకు యూన్ కన్నా మి-జానే కనిపిస్తుంది. ఇది ఆమె నటనను తొలిసారి చూడటం వల్ల అలా అనిపించిందా అని అనుమానం వచ్చి సినిమా సగమ్ కాకుండానే ఆమె నటించిన ఇతర సినిమాలు చూశాక వాటిలో కనిపించిన యూన్ ను పోల్చుకుంటూ మళ్ళా మొదటి నుండీ చూశాను. అయినా నాకు పోయెట్రీలో కనిపించింది ‘మి-జా’నే :-)
ఇక మిగిలిన నటీ నటులలో, మి-జా మనుమడిగా వేసిన కుర్రాడి గురించి. కథలో అతని పాత్రను ముందే ప్రస్తావించాను కదా! అప్పుడు మన మనో ఫలకం మీద కనిపించే లాగానే ఉంటాడు. మి-జా గా వేసిన యూన్ తో పోటీ పడుతాడు. అతని పేరు డేవిడ్ లీ.
మరొక ప్రధాన పాత్ర ప్రెసిడెంట్ కాంగ్. స్ట్రోక్ విక్టిమ్. ఈ పాత్ర పోషించినది కిమ్ హీ-రా, మరొక వెటరన్ నటుడు. అత్యంత సహజమైన నటనతో కట్టి పడేస్తాడు. తప్పదు. ఎందుకంటే అతను నిజ జీవితంలో కూడా పక్షవాతం బారిన పడ్డాడు. అయినా నటన మీద ఉన్న ఆ మక్కువకూ, ఓపికకూ, ఉన్న అవరోధాన్ని అనుకూలంగా మల్చుకుని అద్భుతంగా పాత్ర పోషించిన హీ-రా కు నమో నమః అంతే.మిగిలిన వారు ఇతోధికంగా నటించారు. నటీనటుల సెలెక్షన్ దగ్గర నుండీ, వారి నుంచీ కావలసిన నటనను రాబట్టుకోవటం వరకూ లీ తనదైన ముద్ర వేస్తాడు.
సాంకేతిక నిపుణులు: కెమేరా పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువే. కేవలం దాని గురించే ఒక వ్యాసాన్ని వ్రాయ వచ్చు. ఎడిటింగ్ లీ శైలిలోనే నింపాదిగా, జెర్కులు లేకుండా సాగుతుంది. బాగుంది. నేపథ్య సంగీత అతి తక్కువ. కానీ సినిమాకు తగిన సహకారాన్నందించింది. బఖా సటాంగ్ లో హాంటింగ్ మెలడీస్ ను ఉపయోగించిన లీ ఇక్కడ నిశ్శబ్దాన్ని భలే ఉపయోగించాడు. మిగిలినవన్నీ చిత్రాన్ని ఒక మాడ్రన్ క్లా౨సిక్ గా మిగల్చటంలో తగు పాత్రను పోషించాయి.
దర్శకత్వం: Deserves a special post.
రేటింగ్: 4.5/5
PS:  1. Filmmakers కావాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా స్టడీ చేస్తూ చూడాల్సిన సినిమా.
2. సినిమా టైటిల్ యొక్క అంతరార్థం గురించి చెప్పాలంటే ఈ పరిచయ వ్యాసానికున్న స్కోప్ చాలదు.
నోట్: వ్యాసం మొదట నవతరంగం లో ప్రచురింప బడినది. 

1 comments:

Anonymous,  October 20, 2011 at 9:29 PM  

ఒక అద్భుతమైన సినిమా గురించి తెలుసుకున్నందుకు ఆనందం గా వుంది.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP