Tuesday, March 6, 2012

కార్పోరేట్ కాలేజీల్లో వర్ణ వివక్షః బోడి చదువులూ, జాన్ గాల్టూ!

/hihi

ఇవాళ్టికి నేను Atlas Shrugged మొదటి సారి పట్టుకుని ఐదేళ్ళు. అసలా పుస్తకం గురించి నాకు తెలియటమే తమాషాగా జరిగింది. ఆ పుస్తకముందని నాకు తెలిసిప్పటికి పదేళ్ళు కాగా దాన్ని చదవాలని డిసైడ్ అయ్యి ఆరేళ్ళు కావస్తోంది.

ఇంటర్మీడియేట్లో ఉండగా సెక్షన్లకి సంబంధిన ఒక గొడవ చివరికి నేను ఈ నవల చదవటానికి దారి తీసింది. ఫస్టియర్ మేము కొంత మందిమి ఒక కాలేజ్ లో చేరాము. కానీ ఆ కాలేజ్ ని కొన్ని కారణాల వల్ల ఎత్తేశారు. అప్పుడు మేము వేరే కాలేజ్ లో చేరాల్సి వచ్చింది. ఆలస్యంగా చేరామన్న కారణంతో మమల్ని చాలా మందిని డల్లర్స్ సెక్షన్ లో వేశారు. ఎలాగో ఆ ఏడాది పూర్తి చేశాము. డల్లర్స్ అంటే నిజానికి బాగా పట్టించుకోవాలి. ద బెస్ట్ అనే లెక్చరర్స్ ని వాళ్ళకే వేసి బాగా చదివించి మంచి రిజల్ట్ తెప్పించాలి. కానీ వాస్తవంలో దీనికి విరుద్ధంగా జరిగింది(తోంది). రెండో సంవత్సరంలోకి వచ్చాక మాలో కొందరిని మెరిట్ సెక్షన్లోకి పంపారు. ఆ మెరిట్ లిస్ట్ లో నేను లేను. నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉంటే నేనొక్కణ్ణే ఈ సెక్షన్లో ఉన్నాను.

అదేరోజు ఇంటికెళ్ళాక పెద్ద గొడవ చేసి నాన్నని కాలేజ్ కి రప్పించి ఒక డైరెక్టర్ తో మాట్లాడించాను. నాన్నతో ఆయన దాదాపూ గంట పైన మాట్లాడి, "మీ వాడు లెక్కల్లో వీక్. ఏవో కొన్ని పర్టిక్యులర్ మోడళ్ళు తప్ప అన్నీ చెయ్యడు. పైగా కాస్త ఎవ్వరినీ లెక్క చెయ్యడు. చూద్దాం. పెద్ద వారు మీరు అడిగారు కనుక ఒక వారం చూద్దాం. ఫీడ్‍బ్యాక్ తీసుకుని లెక్కలాయన మెరిట్ సెక్షన్లో అందుకోగలడనుకుంటే తప్పక పంపిస్తాను," అన్నాడు.

ఇంటికెళ్ళాక నాన్నతో లెక్కల విషయంలో చివాట్లు. నానా అగచాట్లూ పడి లెక్కలాయనని మెప్పించి ఆయనతోనే రికమెండ్ చేయించుకుని మరీ మెరిట్ సెక్షన్లోకి వెళ్ళాననే కానీ, నాకెందుకో అసంతృప్తి. నా సంగతి సరే. మరి ఆ డల్లర్స్ సెక్షన్లో ఉన్న వాళ్ళ సంగతేంటి? వాళ్ళకి చెప్పే లెక్చరర్లు అంత బాగా చెప్పరు. వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు కూడా. ఈ తేడా గురించి ఆలో చించి, ఆలోచించి నాకో ఉపాయం తట్టింది. వెంటనే కాలేజ్ ఆశాకిరణం అనుకునేవాణ్ణి ఒప్పించి ఇద్దరం ఎగ్గొట్టాము. ఆరోజు సాయంత్రం కొంత మంది ఫ్రెండ్స్ కలిసి ఎందుకు రాలేదని అడిగారు. (మా ఇద్దరికీ ఏ విషయంలోనూ పడదు. పైగా వాడు నాలా రెగ్యులర్ స్టూడెంట్ కాదు. రోజూ కాలేజ్ కి వస్తుంటాడు). కారణం చెప్పి అందరినీ ఎగ్గొట్టమన్నాము. ఒకరిద్దరు తప్ప వేరేవాళ్ళు ఒప్పుకోలేదు. రెండు రోజులయ్యాక ఆ సెక్షన్లో బాగా చదువుతాడనే పేరున్న కుర్రాడి దగ్గరకు వెళ్ళి మా ఆలోచన చెప్పాము. (ఇక్కడికి ఐదుగురమున్నాము). వాడు ముందు తటపటాయించినా, మేము మామూలుగా ఎగ్గొట్టం లేదనీ, మా ఎగ్గొట్టుడు వెనుక ఒక పర్పస్ ఉందనీ, అది కూడా మా కోసం కాదనీ, వాళ్ళ సెక్షన్ కోసమనీ తెలిశాక/మా మాటలకు కనివిన్స్ అయ్యాక తనే కాదు, ఇంకో ఇద్దరిని ముగ్గులోకి దించాడు. ఎప్పుడూ నాతో తగూ వేసుకునే వాడే నాతో కలిశాక ఇంతకు ముందు అనుమానాలు వ్యక్తం చేసిన మా సెక్షన్ వాళ్ళు కూడా జాయినయ్యారు.


అలా అలా మొత్తం పాతిక మందిమయ్యాము పది రోజుల్లో ఇళ్ళకు నోటీసులెళ్ళాయి. కాకపోతే మా ఇంట్లో ముందే చెప్పి (ఇంట్లో అంటే నాన్నకి అని అర్థం) ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లమ్ కాలేదు. కాకపోతే ఇలా ఎన్నాళ్ళు? దీని వల్ల ఉపయోగం ఏమిటి? ఎప్పటికో ఒక రోజు క్లైమాక్స్ చేరాల్సిందే కదా. అందుకే ఏంచేద్దామని అందరం సమావేశమయ్యాము. అక్కడ చర్చల్లో చాలా మంది నెగటివ్ గానే మాట్లాడారు. మా ప్రయత్నమే తప్పనీ, సెకండియర్లో ఇలాంటి సాహసమే కూడదనీ, ఇంకా ఎగ్గొడితే సిలబస్ అందుకోలేమనీ. ఇంతలో మా సమావేశాన్ని ఒక లెక్చరర్ చూశారు. అది గమనించిన నేను ఆయన్ని ఇంటి దగ్గర కల్సి, మా సమస్యని వినిపించాను. ముందు కాసేప తిట్టినా నా వాదన విన్నాక ఆయన ఎలా ఐనా అందరికీ ఒకే లాంటి కోచింగు వచ్చేలా మాట్లాడతాననీ, రేపటి నుంచీ కాలేజ్ కి రమ్మనీ అన్నారు.


అలా కాదు సార్. మేమొస్తే మాకు వాయింపుడే తప్ప ఏమీ ఉండదు. ముందు మీరు మాట్లాడండి. సమస్యకి పరిష్కారం వస్తేనే మేము మళ్ళా వస్తామని చెప్పాను. అది పద్ధతి కాదు. రేపు నాతో నువ్వు రా. నేను నీ ఎదురుగానే చెప్తాను. నువ్వు కూడా నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చక్కడ. అప్పుడు నువ్వనుకున్నదే జరగొచ్చేమో కదా అని నన్ను తీసుకెళ్ళి డైరెక్టర్లతో సమావేశం పెట్టించారు. ఆరోజంతా అదే గొడవ. కొంత మంది నాకు టీసీ ఇప్పించి పంపాలనే దాకా వెళ్ళారు. నేను మాత్రం కూల్ గా నా ఆర్గ్యుమెంట్ ని వినిపించాను. కనీసం క్లాస్ టాపర్ కూడా కాదు. వాడి మాటకి వాల్యూ ఇస్తారేంటండి అని నన్ను వెనుకేసుకొచ్చిన లెక్చరర్ని విమర్శించారు.


ఆ మాటన్నాక నాకు నిజంగానే మండింది. అంటే క్లాస్ టాపర్ కాందే మాట్లాడ కూడదా? మిగతా వాళ్ళ కి వాయిస్ ఉండకూడదనా? అదే కదా నా బాధ. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేసి తక్కువ చదువు చెప్తారు. అదే మార్కులెక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ ఫీజు, ఎక్కువ చదువూనా? అందుకే కోపంగా, "పావలా ఫీజోడికి ముప్పావలా చదువా? అదే ముప్పావలా చదువోడికి పావలా ఫీజా? బాగానే ఉంది. చదివే వాడికి ప్రోత్సాహం అనుకుందాము.


"కాకపోతే నాకో డౌట్. మీ జురాసిక్ పార్కోళ్ళు (రెసిడెన్షియల్ కాలేజోళ్ళు) చెప్ఫే మాటలేమిటి? సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలనే కదా. మరి మీరు చేస్తోందేమిటి? బాగా చదివే వాళ్ళ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి, వాళ్ళకు మార్కులు తెప్పించటమేనా? మీ ప్రచారానికి అర్థం?" అని అన్నాను. "డల్లర్స్ అనుకునే వాళ్ళలో కూడా బాగా మార్కులొచ్చే వాళ్ళున్నారు. వాళ్ళలో కూడా ఎంసెట్ ర్యాంకులొచ్చేవాళ్ళుంటారు. మీకు పాఠం చెప్పటం రాక పిల్లని అంటే ఎలా? ఏ స్టూడేంట్ కి ఎలా చెప్పాలో కూడా తెలియందే మీరు ఏమి గురువులు? బాగా చెప్తారనే కదా ఇంతలేసి ఫీజులిచ్చి చేరేది? చదవలేని వాళ్ళని వదిలేసేట్టయితే ఇక్కడే ఎందుకు?"


ఇలా వాదించాను. ఇంతలో నాతో ఉన్న నేస్తులిద్దరు కూడా పేరెంట్స్ తో వచ్చారు. వాళ్ళు లోపలకి వస్తే ఏమవుతుందో తెలిసిన పెద్దలు తలొగ్గి, అందరికీ ఒకే లాంటి కోర్స్ ని ఇస్తామని చెప్పారు.


నేను పనైన సంతోషంలో బయటకొస్తుంటే ఒక డైరక్టర్ నన్ను ఉండమన్నారు. మిగతా వాళ్ళు వెళ్ళాక. ఏమౌతుందో అని భయ పడుతుంటే ఆయన చిన్నగా నవ్వి, "నువ్వంటే నాకు బాగా మంట. నీ మాటలకీ, చేతలకీ. బాగా arrogant. పైకి మాట్లాడవు కానీ... అది సరే. నువ్విప్పుడు చెప్పిమ్ది బాగానే ఉంది. మాకా ఆలోచన రాలేదు. ఏదేమైనా చేసిన పద్ధతి బాలేకున్నా, చేసింది మంచి పనే," అన్నారు.


నేను నవ్వుతూ తల పైకెత్తి నించున్నాను. ఆయన కళ్ళలోకి చూస్తూ. ఆయన కొనసాగించారు. "ఇలాగే ఒక నవలలో హీరో చేస్తాడు. అచ్చమ్ ఇలాగే. కాకపోతే అతను నీలా స్టూడెంటు కాదు. ఒక ఫిజిసిస్టు. ఆ పుస్తకంలో ఒక భాగం నా దగ్గర ఉంది. అది నీకిస్తాను. అర్థమవుతుందేమో చూడు."


ఆయన ఇచ్చిన పుస్తకం పేరు Atlas Shrugged. అది 2000 ఆగస్టు. నేనా పుస్తకాన్ని తీసుకున్నాననే కానీ, నాకు దాని మీద ఆసక్తి కలుగలా. పైగా నన్ను ఒకళ్ళతో కంపేర్ చేస్తే మంట. దాన్నో ప్రక్క పడేశాను. పడేశానంటే ఆయన గిఫ్ట్ ని అగౌరవ పరచటం కాదు. ఆ పుస్తకాన్ని చదవలేదంతే.


2003 లో ఒక ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి సండే స్పెషల్ లో The Fountainhead గురించి వ్రాశారు. "వికాసం" అనే శీర్షిక క్రింద. ఆ వ్యాసం నన్నాకర్షించింది. పైగా Howard Roark కాలేజ్ నుంచీ expel చేయబడటం నా దృష్టిలో ఆ హీరోని గ్లోరిఫై చేసింది. అందులోనే అట్లాస్ ష్రగ్డ్ గురించి చెపుతూ ఆ నవల ప్రపచాన్ని నిజంగానే ష్రగ్ చేసిందని ఉంది. అంతే. నాకా పుస్తకాల మీద ఆసక్తి పెరిగిపోయి, చాలా మందినడిగాను. నాకు తెలిసిన ఎవరూ ఆ పేర్లే వినలేదనీ, ఆ పుస్తకాలు ఇక్కడెక్కడా దొరకవనీ చెప్పారు. అప్పుడప్పుడే ఇంటర్‍నెట్ వాడకం మొదలెడుతున్న నేను గూగుల్ గాదినడిగాను. అలా అట్లాస్ సొసైటీ గురిమ్చి తెలిసింది. అందులో అట్లాస్ ష్రగ్డ్ ప్లాట్ సినాప్సిస్ ఉంటే అది ప్రింటు తీయించుకుని చదవాలని పది రోజులు డబ్బులు సేవ్ చేసి, (మొత్తం పేజీలు పదహారు. అప్పట్లో మా ఊళ్ళో ప్రింటు ఐదు రూపాయలు. బొమ్మలుంటే పదిహేను. రెండు బొమ్మలున్నాయందులో) అది ప్రింటు తీసుకుని చదివాను. నాకా కథ బాగా నచ్చి, ఎలాగైనా నవలని చదవాలని డిసైడ్ అయ్యాను. నా వెతుకులాటలో The Fountainhead సినాప్సిస్ లాంటిదేదీ దొరకలేదు. పైగా ఆ నవల గురించి AS లాగా అర్థమయ్యే సమాచారం దొరకలేదు. దాంతో నాకు Roark కన్నా, గాల్ట్ బాగా దగ్గరయ్యాడు.


కాలం గిర్రున తిరిగి 2005 విజయవాడ బుక్ ఫెస్టివల్ సమయం. వెళ్ళాలి. వెళ్ళాలి అనుకుంటూ వాయిదాలేసి, చివరకి జనవరి తొమ్మిదిన కదిలాను. కనిపించిన ప్రతి కౌంటర్లో ఆ పేర్లు చెపుతూ తిరిగాను తిరిగాను. విశాలాంధ్రాలో అడిగితే వాడు కాస్త గట్టిగానే విసుక్కున్నాడు. కాస్త అసభ్య కరమైన పదం కూడా వాడాడు. అప్పుడే డిసైడ్ అయ్యా. ఎలాగైనా విశాలాంధ్రాలో రాండ్ పుస్తకాన్ని కొనాలని. మధ్యలో కొన్ని పుస్తకాలు కొనుక్కుంటూ నవోదయా వాళ్ళ స్టాల్ దగ్గరకెళ్ళి పాత కథ మొదలెట్టాను. అక్కడో పెద్దాయన, "బాబూ ఆ పుస్తకాన్ని ఇందాకన జ్యోతీ బుక్ డిపోలో చూశాను." అని ఆ స్టాల్ నంబరు చెప్పారు.


అంతే. టైటానిక్ టికెట్లు గెల్చుకున్న జాక్ డాసన్ లా గంతులేస్తూ పరిగెత్తాను ఆ స్టాల్ దగ్గరకు. తీరా వెళ్ళాక TF, AS రెండూ ఉన్నాయి కానీ రేటు మాత్రం 264. నా దగ్గర ఉంది 169. ఎలా? ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న పుస్తకాలు. ఆలోచించి ప్రీతికి ఫోను చేసి, ఓ రెండొందలు పట్టుకొస్తే, వచ్చే నెల్లో ఇస్తానన్నాను. రెండొందలు లేవు కానీ, వందైతే ఇప్పుడే వస్తానంది. సరే. ఏదోకటి. అసలు లేకుండే దానికన్నా ఏదోకటి తీసుకుంటే సరి అని ఓకే అన్నాను. ఇంతకీ దేన్ని తీసుకోవాలి? ప్రీతీ వచ్చెసరికి పావు గంట పడుతుంది. ఆలోగా ఆలోచించి, రెండు పుస్తకాలనీ తీసుకుని అటు తిప్పీ, ఇటు తిప్పీ, చివరకి ఏడొందల పేజీలు కూడా లేని (694) TF కన్నా వెయ్యి పేజీల పైన (1069) ఉన్న AS బెటరని దాన్నే డిసైడయ్యా. అలా ఈ జనవరికి AS దొరికి ఐదేళ్ళైంది. So, this is a celebration time. 5 years of Atlas Shrugged.


కొసమెరుపేంటంటే... ఈ నవలని నేను 169 రోజులు చదివితే కానీ పూర్తి కాలేదు (జీర్ణించుకుంటూ).

జనవరి 9, 2010

బుక్స్ అండ్ గాళ్^ఫ్రెండ్స్ లో వ్రాసిన ఆర్టికిల్ ఇది. ఈ మధ్యన దీనికి ఎక్కువ హిట్స్ వచ్చాయి. సగటున రోజుకు పాతిక దాకా. అందుకే ఇక్కడ పెడితే దీని రేగ్యులర్స్ చదువుతారు అని. Did it because it is a good post. Thatz all

/bye

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP