Wednesday, October 29, 2008

శ్రీరామాయణ కథా ప్రారంభం


శ్రీ రామాయణమా? లేక శ్రీమద్రామాయణమా? అన్నది పండితులకి వచ్చే ప్రశ్న. అక్కడి నుండీ మొదలై మొదట గా "సంక్షేప రామాయణం" వ్రాయబడుతుంది.


ఎందఱో రామాయణం వ్రాశారు. మళ్ళీ ఎందుకు?


ఎందుకు సరే! ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. బ్లాగుల్లో రామాయణాన్ని గురించి దుమారాలే రేగాయి. చాలా మంది చాలా రకాలుగా వ్రాసేశారు. మంచిగా చెడుగా. అయినా నాకు రామాయణాన్ని మళ్ళీ వ్రాయాలని కోరిక కలిగింది. కానీ నేను వ్రాసేకన్నా మా నాన్నగారు ఐతే మరింత బాగా వ్రాస్తారని, (ఆయన సంస్కృతాంధ్ర పండితులు) ఆ బాధ్యతని ఆయనకే అప్పజెప్పాను. అయన అందుకు నా అదృష్టం కొద్దీ సమ్మతించారు.


అసలెందుకు రామాయణాన్ని వ్రాయాలని పించిందంటే...


గత ఏడాది నేను హైదరాబాద్ లో మా మేనత్త గారి ఇంట్లో కోచింగ్ కోసం ఉండగా మా దూరపు చుట్టాలు ఐన "శ్రీమాన్ వేదాల నరసింహాచార్యులు", వారి ధర్మపత్ని, "కనకమ్మ" గారు 'ధనుర్మాసం' సందర్భం గా అక్కడికి వచ్చారు. అప్పుడు నాకు వారు మా నాన్నగారి తండ్రికి తమ్ముడి వరుస అవుతారనీ వారిదీ మా సొంత ఊరు ఐన ముత్తుపల్లి అగ్రహారమే అనీ తెలిసింది. అంటే ఆయన నాకు తాతగారూ, ఆవిడ నాకు మామ్మ అవుతారు. వారు నన్నెంతో అభిమానించారు. ఆ రోజు మాటల సందర్భం లో తాతగారికి 'సంక్షేప రామాయణం' గొప్పగా వచ్చనీ, వారు దానిని పారాయణం చేస్తారనీ తెలిసి నాకూ ఆయన చేత ఉపదేశం pondaalani కోరిక కలిగింది.


నేనా రోజున ఆయనని అడిగాను. అందుకు మామ్మా, తాతా సంతోషం తో ఒప్పుకుని నన్నూ, రంగనాథ్ మామనీ వారి ఇంటికి ఒక మంచిరోజు చూసుకుని రమ్మన్నారు.


ఆ తరువాత రెండు నెలలకి, అనగా ఫిబ్రవరి పదిహేడున వెళ్ళాము. తాతా మామ్మా ఎంతో ఆదరించి మాకు రామాయణాన్ని ఉపదేశించారు. నేను జీవిత కాలంలో పొందలేని అభిమానాన్ని ఆ రోజున ఆ పుణ్య దంపదుల వద్ద పొందాను.


ఆ తరువాత వారిని మళ్ళీ కలిసింది, యాదృశ్చికమో, లేక భగవత్సంకల్పమో కానీ 'శ్రీరామ నవమి. ఆ తరువాత కలవలేక పోయాను.


ఈ జూలై ఇరవై రెండున మామ్మ పోయింది. చిత్రమేమిటంటే అది ఆవిడ పుట్టిన రోజు. నాకీ విషయాన్ని రంగనాథ్ మామ చెప్పాడు. నేనిక మామ్మని చూడలేనని ఆ రోజు ఎంతో బాధ పడ్డాను. అందుకే మామ్మకి నివాళిగా వారు నాకుపదేశించిన 'సంక్షేప రామాయణాన్ని' అనువదించి కొంతలో కొంత అయినా ఋణాన్ని తీర్చు కోవాలని అనుకున్నాను. ఐతే ఆ పనిని నేను చేయలేను. అందుకే మా నాన్న ని అడిగాను ఆయన అందుకు సమ్మతించారు.
'సీతా రాముల' లాంటి ఆ పుణ్య దంపదులకి ఈ 'రామాయణం' అంకితం.


తరువాత poste 'రామాయణారంభం'.

Read more...

Monday, October 27, 2008

జమీల్య - 2

పున్నమి (నా భాషలో చెప్పాలంటే జమీల్య) చెప్పుకుంటూ పోయింది.

"'జమీల్య' ఎంత అందమైన పేరు? అసలు ఆ కథ సొగసంతా ఆ పేరులోనే ఉంది. చిన్ఘిజ్ ఐత్మాతోవ్ అద్భుతంగా చెప్పాడు కథని. సయ్యద్. ఒక చిన్న పిల్లడు. అతని మాటల్లోనే రచయిత తన కథని నడిపిస్తాడు. అంటే first person narration అన్న మాట."

నేను 'తమ్ముడి మాట' అనబోయి తమాయించుకున్నాను. ఆ కోకిల పాటకి అడ్డు రాకూడదని.

తను కొనసాగించింది. "మనిషి హృదయాన్తరాళాల్లో ఏ మూలో దాగున్న భావుకతని తట్టి లేపే కథ అది. జమీల్య ని సాదిక్ బలవంతంగా ఎత్తుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అదెలాగంటే... జమీల్య తో ఒక సారి గుర్రప్పందేలలో ఒడి పోతాడు సాదిక్. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనని బలవంతం గా ఎత్తుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటాడు.

"అసలు మగాళ్ళంతా ఇంతేనా? అనిపిస్తుంది చాలాసార్లు. ఆడవాళ్ళు తమ మీద గెలిచినా వారికది అవమానమే! తట్టుకోలేరు. చేతనైతే గెలవాలి. లేదా ఓటమిని హుందాగా అంగీకరించాలి. సాదిక్ కి అది తెలీదేమో. ఐత్మాతోవ్ మనకా మాటని అంతర్లీనంగా చెప్తాడు. సయ్యద్ రూపంలో.

జమీల్య. తన పేరుకు తగ్గట్టుగానే అందమైంది. ఎంత అందమైంది? తన జీవితాన్ని ప్రేమించుకునేటంత అందమైంది. 'ఆమె స్వాభావం లో ఏదో మగవాళ్ళ లక్షణాలు, అదొక మోస్తరు దుడుకుతనం...తనని అకారణంగా పల్లుట్టు మాటైనా అంటే ఊరుకోడు. వాళ్ళని నోరేత్తనీయకుండా మొహం మీదే నాలుగూ అనేసేది' అని మనకి సయ్యద్ చెపుతాడు.

"ఇరుగు పొరుగు అమ్మలక్కలు తన అత్తగారికి చెపితే ఆమె సమర్ధనగా 'ఇదే మంచిది లెండి. మా కోడలు ఉన్నమాట చెపుతుంది. అనేదేదో మొహం మీదే అంటుంది. ఇదే నయం. ఎదుట నోరు నొక్కుకుని చాటున తిట్టటం కంటే. మీ వాళ్ల మౌనం ఓ నటన. ఆ మౌనం - కుళ్ళిన కోడి గుడ్డు: పైకంతా నునుపూ, నిగనిగా. ఇహ లోపలా - ముక్కు మూసుకోవాల్సిందే.' అంతటి అభిమానం. (అయినా...). అలా ఐత్మాతోవ్ మనకి జమీల్యాని పరిచయం చేస్తాడు.

"అసలు జమీల్యా అమ్మాయిలకి డ్రీం గాళ్. ఏ మాయామర్మమూ తెలీని, చిన్నపిల్ల లాంటి మనస్తత్వం. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తటాలున నవ్వటం! చెంగు చెంగున లేడి పిల్లలా గెంతతం. కాలాగాడు మరి. అత్తగారిని కావిలించుకుని చిన్న పిల్ల లా ముద్దెట్టటమ్. అబ్బ! అలా ఉండాలనీ, అంత హాయిగా జీవించాలనీ ఎవరికి ఉండదు.

"అందుకే జమీల్యా సయ్యద్ కి నచ్చింది. తనకి వదినె గారవుతుంది. బిడియం అంటే తెలీని తానంటే గ్రామంలో అందరికీ అంగీకృతం కాదు. అంతే గా తన జీవితాన్ని ప్రేమించటం అంటే ఈ లోకం లో ఒక నేరం. అలాటి వారిని అందరూ అంగీకరించలేరు.

"అవునబ్బాయ్! నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకున్టున్నావ్?" ప్రావాహానికి ఆనకట్ట వేసినట్టు అడిగింది. నా కళ్ళలోకి చూస్తూ.

"నీకేలా తెలుసు?" అడగ బోయాను. వెంటనే తను ఒక దయ్యం అనీ, తనకి ఆ మాత్రం తెలీటం ఆశ్చర్యం కాదనీ నాకు గుర్తొచ్చింది. అందుకే నేను "ముందు నువ్వు చెప్పు. తరువాత నేను చెప్తాను." అన్నా.

తను నిట్టూర్చింది. మళ్ళీ కొనసాగించింది. "చంటీ! ఆడ పిల్లలు కనిపిస్తే అబ్బాయిల కళ్లు ఎక్కువ గా స్కాన్ చేయాలనే ప్రయత్నిస్తాయి. యుద్ధం రోజులయి, ఆ ఊరిలో అందరూ అంటే చాలా కుటుంబాలలో వయసున్న వారిని సైనికులగా పంపాల్సి వచ్చేది. ఊళ్ళో మిగిలేది సంనాసులూ, చిన్న పిల్లలూనూ. అందరి కళ్ళూ జమీల్య మీదే.

"కొందరు సంనాసోల్లకి తానంటే ఏ ఆడదైనా పడి చస్తుందని ఒకరకమైన ఫీలింగు. అలాంటి వారు ఎక్కడైనా ఉంటారు. అలాంటి వాడే ఒస్మాన్. వాడొకసారి తనని అల్లరి పెట్టబోతే జమీల్యా అన్న మాటలు నాకెంత నచ్చాయో. 'యుద్ధం నుంచీ తిరిగి రాని సైనికుని భార్యగా నూరేళ్ళూ ఉంటానుకానీ నీ లాంటి చచ్చు దద్దమ్మ మొహం మీద ఉమ్మనైనా ఉమ్మను.'

ఇది కాదు. తన మనోభావాలని మనం చదవాలి. ప్రేమ లేని పెళ్లి ఎంత గొప్ప కుటుంబం లోకి తీసుకెళ్ళినా జమీల్యా లాంటి అమ్మాయి ఎక్కువ కాలం ఉండలేదు. అందుకే దనియార్ మీద తనకి ఉన్నది ప్రేమే అని గ్రహించగానే బంధనాల అడ్డుతెరాలు తొలగించుకుని వెళ్లి పోయింది.

"సాదిక్ తన ఇంటికి సైనిక స్థావరం నుంచీ ఉత్త వ్రాసే సన్నివేశాన్ని ఐత్మాతోవ్ చాలా బాగా చెప్తాడు. సంప్రదాయ బద్ధం గా పెద్దలందరికీ తన నమస్కారాలను చెప్పి చివరలో 'జమీల్యాని కూడా అడిగానని చెప్పండి.' అంటాడు. అక్కడే తనకి భార్య మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అక్కడ సయ్యద్ భావాలని చదివితే అంతర్లీనంగా ఐత్మాతోవ్ ఎలాంటి సెటైర్ వేశాడో మనకి తెలుస్తుంది.

"ఇది కాదు చంటీ! అసలు విషయం ఇప్పుడు చెప్పుతాను."

నేను నాకు తెలీకుండానే ఆ మాటలని మంత్ర మ ఉగ్దుందిని అయి వింటూనే ఉన్నాను. నేను ఎప్పుడు వాలానో తెలీదు కానీ ఆ స్మశానంలో ఓనా ఎడమ అరచేతిలో తల పెట్టుకుని అలా వింటూనే ఉన్నాను.

నేను వింటున్నానో లేదో అని ఒక సారి చూసి తను నవ్వింది. "ఎందుకు నవ్వావ్?" అడిగాను.

"నువ్వెక్కడ పడుకున్నావో తెలుసా?"

(సశేషం)

Read more...

Sunday, October 26, 2008

"జమీల్య"

ఆ మర్నాడు నన్ను నేను సెల్లు లో కనుగొన్నాను. అలా ఎందుకయ్యిందో తరువాత చెపుతాను. అంతకు ముందు ఓ పడి గంటల క్రితం నేను ఆ దయ్యం తో అన్నాను. "నీ పేరు నాకు నచ్చలా."

"ఎందుకు?"

"పున్నమి, 'పున్నామ నరకం' లాగా ఉంది. అందులోనూ నాకు పున్నమి చంద్రుడు నచ్చడు."

ఎవరో కిసుక్కున నవ్వినట్టు అనిపించింది. ఎవరా అని తల త్రిప్పి చూశాను. ఒక తలలేని ఆకారం. ఆడ దయ్యమే అనుకుంటా. "ఓరబ్బీ! నీగ్గానీ దిమాక్ఖరాబ్ గానీ ఐతున్నదా? అట్లగైతే నిన్ను ఎర్రగాద్దకి పంపాలె!" అంటూ నా మీదకి వచ్చింది. ఎంత చావాలనిపించినా ఆ తల లేని దయ్యాన్ని చూసి వెన్నులో ఒణుకు వచ్చింది. "బాబోయ్!" అని కేక వేయబోయా. "ఏయ్! సోనియా గాంధీ నువ్వూరుకో! తను నా ఫ్రెండ్." పున్నమి అంది.

తను కూచింది తన శవ పేటికలో. "ఎందుకట్టా లేచావ్?" అడిగాను. భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ.

"పున్నమి సెంద్రుడు నచ్చట్లేదంటవ్? ఎర్రి నా కొడుకల్లె ఉన్నవ్ బిడ్డా!"

"ఓరి నాయనోయ్! నువ్వు తెలంగాణా దయ్యానివా? యాస సరిగ్గానే ఉందా?"

"అదా! నేను ఆ యాసని ట్రై చేస్తున్నాను. 'మళ్ళీ తెలంగాణా దయ్యం' అనకు. కేసీయార్ ఎగిరి తంతాడు." అంది సదురు సోనియా గాంధీ. "తను ఎక్కువ గా పున్నమి రోజుల్లోనే లేచి తిరుగుతుంది. అందుకే ఆ పేరు పెట్టాము."

"అంటే పూర్వ నామదేయాలు కూడా ఉంటాయా మీకు?"

"ఉన్నాయి అమ్మా నాన్నా పెట్టిన పేర్లు. ఇక్కడ మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాము."

పున్నమి మా సంభాషణని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అందుకే మేలి ముత్యాలు ఒలక పోస్తున్నట్టు చిరు నవ్వులు చిందిస్తోంది. నెల రాజు 'తిండి తిని నెల రోజులయ్యింది' అన్న టైపులో మొహం పెట్టాడు. ఆమె ముందు వెల వెల పోతున్నందుకు.

"మరి నీ పేరు సోనియా గాంధీ ఎందుకు?" వినాశ కాలే విపరీత బుద్ధి అనుకుంటూ. ఎక్కడ అది నా మీద పడుతుందో అన్న భయం ఉన్నా నా చావు ఎప్పుడొచ్చినా ఏమిటి నష్టం అనుకుంటూ ధైర్యంగా ఉన్నా.

"దానికి బుర్ర లేదని ఆ పేరు పట్టాము కానీ, రా చంటీ! మనం మాతాడుకుందాం," అంది పున్నమి.

"నిన్ను నేను ఏమని పిలవను?"

"పున్నమి నచ్చలేదన్నావుగా! నువ్వే పేరు పెట్టు."

"జమీల్య!"

"చాలా బాగుంది. దాని అర్ధం తెలుసా?"

"తెలుసు. అరబ్బీలో 'అందమనది' అని అర్ధం."

"అబ్బో! చంటి బాబు కి అరబ్బీ కూడా వచ్చే?"

"రాదు." ఏడుపు మొహంతోఅన్నాను. "ఆ పేరు చిన్ఘిజ్ ఐత్మాతోవ్ వ్రాసిన ఒక నవల లోది. హీరోయిన్ పేరు. నాకుబాగా నచ్చిన పేరు అది."

"అబ్బో! అయ్యగారు కళా పోషకులే!" కళ్లు పెద్దవి చేస్తూ ఎక్కిరించింది.

"నీకా కథ తెలుసా?"

"చదివాను. ఈ మధ్యే! ఒక శాపులోనుంచీ కొట్టేసి. ఆ హీరోయిన్ నాకూ బాగా నచ్చింది. నాకూ తనలా ఉండాలనిపించింది."

"ఐతే ఆ కథ చెపుతావా?"

"చదివానన్నావ్?"

"నీ మాటల్లో వినాలనీ..."

"సరే! విను" అంటూ మొదలెట్టిందికాదు కానీ ఆ కథ గురించి చెపుతాను. అయినా ఇది చెప్పు. నీకు పున్నమి అన్న నా పేరు ఎందుకు నచ్చ లేదు?"

"నాకు పంచమి చంద్రుడంటే ఇష్టం."

"గురుడికి తిక్కేమన్నా ఉందా?"

"కాదు పంచమి చంద్రుడు ఎలా ఉంటాడు?"

ఇలా అంటూ గాల్లో చూపించింది. నిజంగానే అక్కడ ఆ ఆకారం నాకు గాల్లో కనిపించింది. సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను.

"ఇలా కదా! అలా చూడు. నవ్వుతున్నట్టు లేదూ! అదే పున్నమి చంద్రుడు అదోలా నోరు తెలుచుకుని నిద్దరోతున్న న్యాయం లా ఉంటాడు. అదీ కాక కొంచం ఏడుపు సింబల్లా!"

"నీలోనూ విషయం ఉందబ్బాయ్! ;-) కానీ ఏడుపు సింబల్ సరిగా లేదేమో! కథ విను." ముగ్ధ మనోహరంగా నవ్వింది.

ఆ కలకూజిత స్వరం లోనుంచీ ఆ కథ గురించి ఇలా విన్నాను.

(సశేషం)

Read more...

Friday, October 17, 2008

పున్నమి - ఏ'కాంత'వేళ

చిక్కని చీకటిలో నాకు వెన్నల మాత్రమే తోడుంది. వెండి వెన్నెల పిండార బోసినట్లు నన్ను కౌగిలించుకుని గిలిగింతలు పెడుతున్నా నా మనసు పౌర్ణమి చంద్రుని వలె విషాదంగా ఉంది. నేనప్పుడు ఏకాంతంగా లేను. ఒంటరిగా ఉన్నాను. తుంటరి పిల్లగాలి నిదురించే తోటలో అల్లరి చేస్తూ నా ముంగురులని కవ్విస్తోంది.

ఆకాశం లో నక్షత్రాలు బొంతకేసిన కుట్లు లాగా ఉన్నాయి. చిక్కి పోయి. పున్నమి చంద్రుడు నోరు తెరుచుకుని చూస్తున్నాడు నా కష్టాన్ని. ఇంతలో సెలయేటి గల గల లా నవ్వు వినిపించింది. ఎవరా అని మబ్బుల్లోంచీ తొంగి చూసిన చందమామలా బింకంగా ఆ వైపు చూశాను. దిక్కు కూడా నాకు గుర్తులేదు.

నిశ్శబ్దం తన శ్రుతిని సరి చేసుకుంది. ఆ గొంతుతో పాటూ తనూ పాదాలని. ఓనిడా సేల్ల్ఫోన్లో కాల్ చేసేటప్పుడు వచ్చే సిగ్నల్ లాగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు ని చూసి చంద్రుడు దాక్కున్నాడు మబ్బుపిల్ల వెనుక. సిగ్గు పడి. అంతందంగా నేను లేనే అని.

మళ్ళీ చిమ్మ చీకటి. మరో సారి అదే నవ్వు. పంచమి కాంతుల రాకేశుడు సరిగమల సప్త స్వరాలాలపించినట్టుగా ఆమె నా ముందు నిలిచింది. చేతిలో ఒక క్రొవ్వొత్తి. నా ఎదలోని చీకట్లని తరిమివేసేందుకు. నా ముందునుంచీ తనలా సాగిపోతుంటే నేను అనుసరించాను. ఆమె నావైపోకసారి చూసి నవ్విందలా మళ్ళీ. ఎద పొంగి గండి పడటంతో నేను కాసేపలా ఆగి కొంచం దూరంగా ఆమె వెనుకే వెళ్లాను. ఎంతసేపు గడిచిందో తెలీదు. రేతుంటరి కళ్ళప్పగించాడు ఆ వదనారవిందానికి. నాకూ నవ్వొచ్చింది. పైన ఉన్న చలువ భామలనొదలి ఈ కలువ భామ వెంట పడ్డాడే అని.

ఆమె ముందుకి సాగుతూనే ఉంది. సెలయేటి అలలా. దారిలో రెండు నల్లని గండు పిల్లులు. మీసం మెలేస్తూ ఆమె ని చూచారు. నేనలా గుడ్లప్పగించాను. ఏమి చేస్తుందో ఈ సోయగాల పసిడి చిన్నది. చేతిలోని క్రొవ్వొత్తిని అలాగే పట్టుకుంది. చంటి పాప అమ్మ రొమ్ముని పట్టుకున్నట్లు. చంద్రుడు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు తన ప్రయాణాన్ని ఆపేశాడు. చుక్కలన్నీ పెద్దవైనై. ఆ దృశ్యాన్ని చూద్దామని. ఉత్కంఠత తో.

తను ముందు కెళ్ళింది. వారూ ఆమెని అనుసరించారు. పాల ధార వెనుక దొంగ పిల్లిలా. ఆమె నడిచింది. చిన్నగా... వెళ్ళింది ఒక ఇంటిలోకి. వారూ అనుసరించారు. నేనలా ముందుకి దుమికాను. కాపాడుదామని. తలుపులు మూసుకున్నాయి. ఐదు నిమిషాలు గడిచాయి. తన్నలా ఒదిలేశానే అని బాధ.

తలుపులు తెరుచుకున్న గుదిలోంచీ వచ్చిన దేవతలా ఆమె నా ముందుకి వచ్చింది. ముఖంలో మెరుపుల వెలుగులు. ఏమైందో? వారేమి చేశారో? "ఏమయ్యారు?" అడిగాను. "కోరిందిదొరికి వెళ్ళారు అలా ముందుకు" అంది. ఆ మాటలు కోకిల కూతలు. తోడు రానా అన్నాను. నీకిష్టమా అంది. అవును అన్నాను నేను. సరే! అంది. తన వెంట సాగాను. అలా అలా నడిచాము. ఊరు దాటాము. పొలాలనీ దాటాము. తనతో మాటల్లో పడి నా దారిని నేను మరిచాను.

"మీ ఇల్లెక్కడ?" అడిగాను. నవ్వింది సమాధానం గా. "రాగలవా?" అన్నట్లు.

"రాగాలనేమో!" అన్నాను. ఉత్సుకతతో. ముందుకు సాగామలా. అలా. అలా. తల తిప్పి చూశాను రాత్ కా బాద్శాహ్ ని. ఏడువ లేక నవ్వాడు. "నీకు దొరకదుగా" అన్నట్టు నేను ఒక చూపువిసిరి ఆ చుక్కలు నీకు అందనివి. ఈ పంచమి కాంతుల జాబిలమ్మ నాకే అన్నాను. మౌనంగానే. ఇంతలో తను ఎటో తిరిగింది. నేనూ తననే అనుసరించాను. నాకాశ్చర్యం ఎక్కడకెళ్తోందని.

తను వెళ్ళింది. నేనాగాను. రమ్మని పిలిచింది. కమ్మగా నవ్వింది. నేనూ నవ్వాను చాలా కాలం తరువాత. సహజంగా. నాలుగాడుగు వేశానో లేదో...

ఒక పెట్టె తెరుచుకుంది. తనలా వెళ్లి అందులో పడుకుంది. కళ్లు పెద్దవయ్యాయి. పౌర్ణమి చంద్రునిలో మచ్చలలా.

నవ్వో నిట్టూర్పో తెలీదు. నాలోంచీ ఒక శబ్దం వచ్చింది. "నా పేరు చెప్పనే లేదు కదూ. 'పున్నమి'"

"నాపేరు...."

"ఒద్దులే. ముద్దుగా ఉన్నావు. చంటీ అంటాను సరేనా?"

"సరే!"

"నేనెవరో చెప్పనా?"

"చెప్పు."

"నేనొక దెయ్యాన్ని." మళ్ళీ నవ్వింది. చల్లగా. ఆత్రంగా చూసింది. నేను భట పడుతానని. లేదు. కొన్ని గంటల క్రితం చావు గురింది ఆలోచించిన వాడిని కదా!

అక్కడే కూల పడ్డాను. "ఏమిటి వెళ్ళవా?" అంది.

లేదన్నాను. "కథ చెపుతావా" అడిగాను.

సరే! అంది. అప్పుడే నాకు బ్రతకాలనే కోరిక ఉదయించింది.

ఆ దయ్యం చెప్పిన కథలు నాలో ఒక ధైర్యాన్ని పెంచాయి. ఆ కథలు "పున్నమి చెప్పిన కథలు."

Read more...

Monday, October 13, 2008

"రామాయణం"

నాకు అంతర్జాలంతో పరిచయం శూన్యం. ఎప్పుడన్నా పిల్లలు చెప్పి చూపిస్తే చూడటమే. ఈ మధ్య మా అబ్బాయి బ్లాగులనే పేరుతో అంతర్జాలంలో ఏవేవో వ్రాస్తున్నానని చెప్పాడు. వాటిని పరిశీలిస్తే కొన్ని బాగానే అనిపించాయి. కొందరు బ్లాగ్గర్లు వ్రాసిన వాటిని తెచ్చి చూపగా అంతర్జాలంలో తెలుగు బాగానే వెలుగుతున్నదన్న ఆశ కలుగుతున్నది.

కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖం
వందే వాల్మీకి కోకిలం

నన్ను సంక్షేప రామాయణాన్ని వ్యాఖ్యాన సహితంగా వ్రాయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అయితే ఓపిక లేక ఉపేక్షిస్తూ వచ్చాను. అయితే తన వాదనతో నన్ను మొత్తానికీ ఉత్సాహ పరిచి నన్ను ఒప్పించాడు. అంతర్జాలం లో పెడతానని అనటం తో, ఆ మధుర కావ్యాన్ని మరలా తలుచుకునే భాగ్యం నాకు కలిగింది.

ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుతూ నా వీలుననుసరించి 'రామాయణం' అనబడే ఆ మధుర కథను నా శైలిలో అనువాదము చేసే పనిని చేపడుతాను.

సెలవ్.

వేదాల రాజగోపాలాచార్య.

Read more...

Saturday, October 11, 2008

వాన్ టూ త్రీ... FedEx కి నో ఎంట్రీ!

Rafael Nadal ఈ సంవత్సరాన్ని number one గానే ముగించటం ఖాయమైంది. తన క్రీడా జీవితం లో రికార్డులని బద్దలు కొత్తతమే కానీ మిస్ అవటం తెలీని FedEx తొలిసారిగా ఒక అద్భుతమైన రికార్డుని మిస్ అవుతున్నాడు. :-((
అది వరుసగా ఎక్కువ సార్లు Tennis Season ని number one గా ముగించటం.

Pete Sampras వరుసగా ఆరు సంవత్సరాలు ఆ రికార్డుని సాధించగా, Jimmy Conners ఆ రికార్డుని ఐదేళ్లు సాధించాడు. ఇప్పటికి 2004-07 season లలో number one గా ఉన్న FedEx ఈసారి తన rank ని కోల్పోవటం ద్వారా ఆ అరుదైన రికార్డుని Pete Sampras నుంచీ అందుకునే అవకాశాన్ని కోల్పోవటం బాధగానే ఉన్నా Pete Sampras రికార్డు అలాగే ఉండటం నాకు personal గా ఆనందం కలిగించింది. Theoretical గా అసాధ్యం కానప్పటికీ అవకాశాలు బహు స్వల్పం.

World Men's Rankings Top ten: (tennis magazine news letter సౌజన్యంతో)
Rank
Name
Country
Ranking Pts
1
Rafael Nadal
ESP
7000
2
Roger Federer
SUI
5930
3
Novak Djokovic
SRB
4960
4
Andy Murray
GBR
2995
5
Nikolay Davydenko
RUS
2400
6
David Ferrer
ESP
2315
7
David Nalbandian
ARG
1975
8
Andy Roddick
USA
1970
9
Juan Martin del Potro
ARG
1685
10
Stanislas Wawrinka
SUI
౧౬౭౦
----------------------------------------------------------------------------------------

ఇందాకన వీరేంద్ర సెహ్వాగ్ 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రేపు దూరంగా పోతున్న బంతిని వేటాడి ఔట్ అయ్యాడంటారు జనం. కానీ అదే బంతికి ఫోర్ వస్తే? ;-)
----------------------------------------------------------------------------------------

Lance Armstrong మళ్ళీ సైక్లింగ్ బరిలో దిగుతున్నాడు. Kudos. రా రా రా రారా Armstrongoo.
----------------------------------------------------------------------------------------

ఈసారి Oliver Kahn గురించి వ్రాస్తాను.

Read more...

Tuesday, October 7, 2008

'గన్'గూలి : ది లాస్ట్ ఎయిమ్.

మొత్తానికీ అందరూ కలిసి గంగూలి ని దించేశారు. The pride of India has hung up his boots.

భారత కెప్టెన్ గా గుబాళించిన సౌరభం తన సువాసనలని మన కందరికీ వదిలేసి తను మాత్రం అంతర్జాతీయ యవనిక మీద నుంచీ తొలగి పోతున్నాడు. Pure and stylish తరహా క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు ఆ భాగ్యం లేకుండా చేసి, 'దాదా'పుగా గెంతెయబదకుండానే గౌరవం గా తప్పుకుంటున్నాడు.

సౌరవ్ గంగూలీ గురించి నేను వ్రాయాలని అనుకున్నాను. కానీ ఇలా అని మాత్రం అనుకోలేదు. సరే! మనమందరం ఆ కలకత్తా రాకుమారునికి దసరా శుభాకాంక్షలతో వీడుకోలు చెబుదాం. ఆస్సీస్ సీరీస్ లో గంగూలీ విజయవిహారం చేయాలని అందరం కోరుకుందాం. అతని శిష్యుడు సెహ్వాగ్ అన్నట్టుగా కనీసం 3-1 తేడాతో మన వాళ్లు గెల్చి 'గన్'గూలి కి విజయానందం తో వీడుకోలు చెప్పాలని... మన విజయ సారధి... సగర్వంగా తన కేరీయర్ ని ముగించాలి అని కోరుకుంటూ.

మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు.

Read more...

Monday, October 6, 2008

తొలి వందనం అమ్మకే.


అమ్మకి నేను సెల్ఫోను కొనిచ్చాను. స్టేట్మెంట్ లో ఏదో లోపం ఉంది కదూ! "అమ్మ నన్ను తనకు సెల్ఫోను కొననిచ్చింది." ఇప్పుడు బాగుంది.

"పదిమంది ఉపాధ్యాయులుకంటే, ఒక ఆచార్యుడు (గురువు) గొప్పవాడు. వందమంది గురువులకంటే ఒక తండ్రి గొప్పవాడు. వేయి మంది తండృల కంటే ఒక తల్లి గౌరవనీయురాలు." ఓహ్! ఎంత బాగుంది చెప్పుకునేందుకు. అసలు అమ్మ గొప్పతనాన్ని చెప్పటానికి వేరొకరితో పోల్చాలా? అమ్మ కి పోలికా? అసలు అమ్మంటే? అవును అమ్మంటే?

నిజం! నాకేమీ తెలీదు. అందుకే నేను ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాను. చెప్పలేక బాధగా ఉన్నాను. బాధతో కళ్లు మూసుకున్నాను. నాకప్పుడు భారంగా శ్వాస పీల్చటం తెలుస్తోంది. ఆ ఊపిరినే గమనించాను. మరికొంచెం సేపు. ఇంకొంచంసేపు. అప్పుడు అమ్మ నాకు కనిపించింది. అప్పుడు నాకు అర్ధమైంది. అమ్మంటే నా ఊపిరి. నా ప్రాణం. నా జీవనం. నా జీవనాధారం. నా శ్వాసని వేరెవరైనా నా కోసం పీల్చగలరా? నా శ్వాసకి నేను ఎవరితోనైనా పోలిక చెప్పగలనా? అంతే. అమ్మ కూడా అంతే. అమ్మకి పోలిక చెప్పటం మన ఫూలిష్నెస్స్.

నవమాసాలూ మోసి, కని పెంచి, ఎంత మంది చెప్పలేదీ కబుర్లు? ఇక చాలు. ఆపుదాం. కని పెంచటం కాదు. ఆ రెండే కాదు. ఇంకా చాలా! అమ్మంటే మనము తీసుకునే ఆహారం. మనం నివసించే ప్రకృతి. చూశారా? ఇప్పుడే అమ్మంటే తెలుసు కున్నాను అనుకున్నాను. కానీ ఏమీ తెలీదు. ఏదేదో చెప్పేస్తున్నాను. అమ్మని పొగుడుదాం అనుకుంటే నేను భావుకుడిని కాదు. అమ్మ గురించి కవిత్వం చెపుదాం అనుకుంటే నేను కవినీ కాదు. మరి నువ్వెవరివి అంటారా? అద్గదీ... ఇప్పుడు దొరికింది.

నేను.
C/o amma.

మనిషి.
C/o అమ్మ.

అసలు సృష్టికే మూలకారణం అమ్మ. అందుకే అమ్మ నా ఊపిరి. నీ ఊపిరి. మనందరి ఊపిరి.

దేవుడు అందరి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. నాకు మళ్ళీ అర్ధం కాలేదు. అసలు దేవుడంటే సర్వ శక్తిమంతుడు అంటారు కదా? మరి ఆయన అందరి వద్దా ఉండలేడా? ఆలోచనే ఫూలిష్నెస్స్. మరి అమ్మ ఎందుకు? ఆలోచించాల్సిన ప్రశ్నే!

నాకిప్పుడు భయం వేస్తోంది. మళ్ళీ కళ్లు మూసుకున్నాను. కరంట్ పోయింది. భయంకరమైన చీకటి. ఏంచేయాలో తోచలేదు. ఏమిచేయాలి? చీకటిని తొలగించాలంటే వెలుతురు కావాలి. మరి ఆ వెలుగెవరు? ఆ వెలుగు అమ్మే!

ఎందుకంటే నీ బ్రతుకుని నిర్దేశించేది అమ్మే!

ముందొక మాట చెప్పాలని ఉంది.

రాముడు అడవికి వెళుతున్నాడు. సీతమ్మనీ తనతో తీసుకుని వెళుతున్నాడు. లక్ష్మణ స్వామీ బయలు దేరాడు. సుమిత్రాదేవి ఏమి చెప్పిందో తెలుసా?

"रामं दशरथं विद्धि
माम विद्धि जनकात्मजा
अयोध्याम अटवीम विद्धि
गाच्छ तातयथा सुखं"

రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజా!
అయోధ్యాం ఆటవీం
విద్ధి
గచ్ఛ తాత యథా సుఖం.

అంటే...

"నాయనా! రాముణ్ణి దశరథుని వలె భావించు. సీతమ్మని నన్ను వలె భావించు. ఆటవిని అయోధ్య వలె భావించు. ఇక్కడి వలెనె సుఖంగా ఉండు."

నాయనా! నువ్వు వెళ్లొద్దు, అనలేదు. నాయనా నీవు లేనిదే నేను ఉండలేను, అనలేదు. కొడుకు గురించి అధైర్య పడలేదు. రాముని గూర్చి అపోహ పడలేదు. అడవిలో నా బిడ్డ ఎలా బ్రతుక గలదు? అనే భయమే లేదు. లక్ష్మణ స్వామి మీద అంత నమ్మకం. తమ్ముడిని తనతో సమానంగా చూసుకుంటాడని రాముని మీద అంత నమ్మకం. అంత ధైర్యం కలది కాబట్టే సుమిత్రాదేవి అంత గొప్ప అమ్మ.

కైక లా అసూయ లేదు. కౌసల్య లా ఆవేశం లేదు. చేయాల్సిన పని మీద దృష్టి అంతే! She lead Lakshmana swami from the front with those cool words.

ఈ మాటలని వ్రాయ గలిగినందుకు వాల్మీకి ఎంత అదృష్టవంతుడు?

ఒక్క మాటలో తన బిడ్డకి లక్ష్య నిర్దేశం చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలా ఆలోచించగాలగాలో చెప్పింది.
"నాయనా! అతవినే అయోధ్య అనుకో. ఆహాహా! అంటే? నువ్వు ఎక్కడ ఉంటే అదే నీ ఊరు. అదే నీ ఇల్లు. నిన్ను నడిపించే అన్నే నీకు పితృ సమానుడు. అన్నా భార్యే నీకు తల్లి లాంటిది. అంటే? అడవి దాటారు. జనపదాల్లోకి వెళ్ళారు. అప్పుడు జనపస్డమే నీకు ఇల్లు. దాటారు. నగరానికి వెళ్ళారు. అదే నీ ఇల్లు. ఎక్కడికైనా వెళ్ళు. ప్రదేశం నీదే! ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఉంటుంది కనుక. ఎలా? అమ్మంటే నీ ఊపిరే కదా! నీ ఊపిరి ఎక్కడ ఉంటే అక్క అమ్మ ఉన్నట్లే! ఎలా? శ్వాసని నీకు ఇచ్చింది అమ్మే కదా!"

ఎంత బాగా చెప్పింది? వసుధైక కుటుంబం.

అంతేనా?

అమ్మ చేతి ముద్ద కమ్మన అంటారు. ఛా! నిజమా?

ఒకటి మాత్రం నాకు తెలుసు. మనం తినే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో వాటి ప్రభావం ఆ ఆహారం మీద ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు వండింది తినకూదదంటారు. అలాగే నా మాటేంటంటే, తినే వారి ఆలోచనలు కలిపే వారి చేతి ద్వారా ఆహారం లో ప్రవేసిస్తాయి. మనం తినేటప్పుడు అందుకే అన్నం మీదే దృష్టి పెట్టాలి. కానీ మనం ఆ పని చేయలేం. అదే
అమ్మ మనకి కలిపి పెడుతుంటే? అమ్మంటే నీ శ్వాసే! అమ్మ దృష్టి నీ మీదే! బిడ్డ ఆకలి మీదే! అంటే తనలో అప్పుడు ప్రేమ ప్రొంగి ప్రవహిస్తుంటుంది. ప్రేమ తన చేతుల మీదుగా నీ ఆహారం లోనికి వెళుతుంది. ప్రేమే నీలో కలిసి పోతుంది. ప్రేమే నీ రక్తంలో కలసి పోతుంది. ప్రేమే నువ్వు అవుతుంది. నీ లో నుంచీ ప్రవహిస్తుంది. నీ ప్రేమ అందరినీ చేరుతుంది. ప్రపంచాన్నే ప్రేమ ముంచెత్తుతుంది. అప్పుడు అందరూ నీకు నీ లాగే కనిపిస్తారు. నిన్ను నీవు ద్వేషించ లేవు. అంతటికీ కారణం... 'అమ్మ చేతి ముద్ద'.

ఇప్పుడు చెప్పండి! అమ్మ చేతి ముద్ద కమ్మన అంటూ అమ్మ ప్రేమకు ఒక రుచిని అంటగట్టగలమా? అమ్మ ప్రేమకీ అమ్మతనానికీ ఒక పరిధి నిర్ణయించగలమా?

అమ్మ ప్రేమకి ఒక పరిధి లేనట్టే అమ్మ గురించి చెప్పుకునేందుకు అంతం లేదు. అందుకే మళ్ళీ కలుద్దాం.

అమ్మ కరుణ కలిగింది. క అంటే బ్రహ్మ. రుణ = ఋణం. కలిగింది. బ్రహ్మ ఋణం కలిగింది. అంటే? బ్రహ్మే అమ్మకు రుణ పడి ఉన్నాడు. అమ్మని చేసిన బ్రహ్మే అమ్మకి రుణ పడి ఉన్నాడు.



గీతాచార్య.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP