Friday, October 17, 2008

పున్నమి - ఏ'కాంత'వేళ

చిక్కని చీకటిలో నాకు వెన్నల మాత్రమే తోడుంది. వెండి వెన్నెల పిండార బోసినట్లు నన్ను కౌగిలించుకుని గిలిగింతలు పెడుతున్నా నా మనసు పౌర్ణమి చంద్రుని వలె విషాదంగా ఉంది. నేనప్పుడు ఏకాంతంగా లేను. ఒంటరిగా ఉన్నాను. తుంటరి పిల్లగాలి నిదురించే తోటలో అల్లరి చేస్తూ నా ముంగురులని కవ్విస్తోంది.

ఆకాశం లో నక్షత్రాలు బొంతకేసిన కుట్లు లాగా ఉన్నాయి. చిక్కి పోయి. పున్నమి చంద్రుడు నోరు తెరుచుకుని చూస్తున్నాడు నా కష్టాన్ని. ఇంతలో సెలయేటి గల గల లా నవ్వు వినిపించింది. ఎవరా అని మబ్బుల్లోంచీ తొంగి చూసిన చందమామలా బింకంగా ఆ వైపు చూశాను. దిక్కు కూడా నాకు గుర్తులేదు.

నిశ్శబ్దం తన శ్రుతిని సరి చేసుకుంది. ఆ గొంతుతో పాటూ తనూ పాదాలని. ఓనిడా సేల్ల్ఫోన్లో కాల్ చేసేటప్పుడు వచ్చే సిగ్నల్ లాగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు ని చూసి చంద్రుడు దాక్కున్నాడు మబ్బుపిల్ల వెనుక. సిగ్గు పడి. అంతందంగా నేను లేనే అని.

మళ్ళీ చిమ్మ చీకటి. మరో సారి అదే నవ్వు. పంచమి కాంతుల రాకేశుడు సరిగమల సప్త స్వరాలాలపించినట్టుగా ఆమె నా ముందు నిలిచింది. చేతిలో ఒక క్రొవ్వొత్తి. నా ఎదలోని చీకట్లని తరిమివేసేందుకు. నా ముందునుంచీ తనలా సాగిపోతుంటే నేను అనుసరించాను. ఆమె నావైపోకసారి చూసి నవ్విందలా మళ్ళీ. ఎద పొంగి గండి పడటంతో నేను కాసేపలా ఆగి కొంచం దూరంగా ఆమె వెనుకే వెళ్లాను. ఎంతసేపు గడిచిందో తెలీదు. రేతుంటరి కళ్ళప్పగించాడు ఆ వదనారవిందానికి. నాకూ నవ్వొచ్చింది. పైన ఉన్న చలువ భామలనొదలి ఈ కలువ భామ వెంట పడ్డాడే అని.

ఆమె ముందుకి సాగుతూనే ఉంది. సెలయేటి అలలా. దారిలో రెండు నల్లని గండు పిల్లులు. మీసం మెలేస్తూ ఆమె ని చూచారు. నేనలా గుడ్లప్పగించాను. ఏమి చేస్తుందో ఈ సోయగాల పసిడి చిన్నది. చేతిలోని క్రొవ్వొత్తిని అలాగే పట్టుకుంది. చంటి పాప అమ్మ రొమ్ముని పట్టుకున్నట్లు. చంద్రుడు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు తన ప్రయాణాన్ని ఆపేశాడు. చుక్కలన్నీ పెద్దవైనై. ఆ దృశ్యాన్ని చూద్దామని. ఉత్కంఠత తో.

తను ముందు కెళ్ళింది. వారూ ఆమెని అనుసరించారు. పాల ధార వెనుక దొంగ పిల్లిలా. ఆమె నడిచింది. చిన్నగా... వెళ్ళింది ఒక ఇంటిలోకి. వారూ అనుసరించారు. నేనలా ముందుకి దుమికాను. కాపాడుదామని. తలుపులు మూసుకున్నాయి. ఐదు నిమిషాలు గడిచాయి. తన్నలా ఒదిలేశానే అని బాధ.

తలుపులు తెరుచుకున్న గుదిలోంచీ వచ్చిన దేవతలా ఆమె నా ముందుకి వచ్చింది. ముఖంలో మెరుపుల వెలుగులు. ఏమైందో? వారేమి చేశారో? "ఏమయ్యారు?" అడిగాను. "కోరిందిదొరికి వెళ్ళారు అలా ముందుకు" అంది. ఆ మాటలు కోకిల కూతలు. తోడు రానా అన్నాను. నీకిష్టమా అంది. అవును అన్నాను నేను. సరే! అంది. తన వెంట సాగాను. అలా అలా నడిచాము. ఊరు దాటాము. పొలాలనీ దాటాము. తనతో మాటల్లో పడి నా దారిని నేను మరిచాను.

"మీ ఇల్లెక్కడ?" అడిగాను. నవ్వింది సమాధానం గా. "రాగలవా?" అన్నట్లు.

"రాగాలనేమో!" అన్నాను. ఉత్సుకతతో. ముందుకు సాగామలా. అలా. అలా. తల తిప్పి చూశాను రాత్ కా బాద్శాహ్ ని. ఏడువ లేక నవ్వాడు. "నీకు దొరకదుగా" అన్నట్టు నేను ఒక చూపువిసిరి ఆ చుక్కలు నీకు అందనివి. ఈ పంచమి కాంతుల జాబిలమ్మ నాకే అన్నాను. మౌనంగానే. ఇంతలో తను ఎటో తిరిగింది. నేనూ తననే అనుసరించాను. నాకాశ్చర్యం ఎక్కడకెళ్తోందని.

తను వెళ్ళింది. నేనాగాను. రమ్మని పిలిచింది. కమ్మగా నవ్వింది. నేనూ నవ్వాను చాలా కాలం తరువాత. సహజంగా. నాలుగాడుగు వేశానో లేదో...

ఒక పెట్టె తెరుచుకుంది. తనలా వెళ్లి అందులో పడుకుంది. కళ్లు పెద్దవయ్యాయి. పౌర్ణమి చంద్రునిలో మచ్చలలా.

నవ్వో నిట్టూర్పో తెలీదు. నాలోంచీ ఒక శబ్దం వచ్చింది. "నా పేరు చెప్పనే లేదు కదూ. 'పున్నమి'"

"నాపేరు...."

"ఒద్దులే. ముద్దుగా ఉన్నావు. చంటీ అంటాను సరేనా?"

"సరే!"

"నేనెవరో చెప్పనా?"

"చెప్పు."

"నేనొక దెయ్యాన్ని." మళ్ళీ నవ్వింది. చల్లగా. ఆత్రంగా చూసింది. నేను భట పడుతానని. లేదు. కొన్ని గంటల క్రితం చావు గురింది ఆలోచించిన వాడిని కదా!

అక్కడే కూల పడ్డాను. "ఏమిటి వెళ్ళవా?" అంది.

లేదన్నాను. "కథ చెపుతావా" అడిగాను.

సరే! అంది. అప్పుడే నాకు బ్రతకాలనే కోరిక ఉదయించింది.

ఆ దయ్యం చెప్పిన కథలు నాలో ఒక ధైర్యాన్ని పెంచాయి. ఆ కథలు "పున్నమి చెప్పిన కథలు."

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP