Monday, October 6, 2008

తొలి వందనం అమ్మకే.


అమ్మకి నేను సెల్ఫోను కొనిచ్చాను. స్టేట్మెంట్ లో ఏదో లోపం ఉంది కదూ! "అమ్మ నన్ను తనకు సెల్ఫోను కొననిచ్చింది." ఇప్పుడు బాగుంది.

"పదిమంది ఉపాధ్యాయులుకంటే, ఒక ఆచార్యుడు (గురువు) గొప్పవాడు. వందమంది గురువులకంటే ఒక తండ్రి గొప్పవాడు. వేయి మంది తండృల కంటే ఒక తల్లి గౌరవనీయురాలు." ఓహ్! ఎంత బాగుంది చెప్పుకునేందుకు. అసలు అమ్మ గొప్పతనాన్ని చెప్పటానికి వేరొకరితో పోల్చాలా? అమ్మ కి పోలికా? అసలు అమ్మంటే? అవును అమ్మంటే?

నిజం! నాకేమీ తెలీదు. అందుకే నేను ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాను. చెప్పలేక బాధగా ఉన్నాను. బాధతో కళ్లు మూసుకున్నాను. నాకప్పుడు భారంగా శ్వాస పీల్చటం తెలుస్తోంది. ఆ ఊపిరినే గమనించాను. మరికొంచెం సేపు. ఇంకొంచంసేపు. అప్పుడు అమ్మ నాకు కనిపించింది. అప్పుడు నాకు అర్ధమైంది. అమ్మంటే నా ఊపిరి. నా ప్రాణం. నా జీవనం. నా జీవనాధారం. నా శ్వాసని వేరెవరైనా నా కోసం పీల్చగలరా? నా శ్వాసకి నేను ఎవరితోనైనా పోలిక చెప్పగలనా? అంతే. అమ్మ కూడా అంతే. అమ్మకి పోలిక చెప్పటం మన ఫూలిష్నెస్స్.

నవమాసాలూ మోసి, కని పెంచి, ఎంత మంది చెప్పలేదీ కబుర్లు? ఇక చాలు. ఆపుదాం. కని పెంచటం కాదు. ఆ రెండే కాదు. ఇంకా చాలా! అమ్మంటే మనము తీసుకునే ఆహారం. మనం నివసించే ప్రకృతి. చూశారా? ఇప్పుడే అమ్మంటే తెలుసు కున్నాను అనుకున్నాను. కానీ ఏమీ తెలీదు. ఏదేదో చెప్పేస్తున్నాను. అమ్మని పొగుడుదాం అనుకుంటే నేను భావుకుడిని కాదు. అమ్మ గురించి కవిత్వం చెపుదాం అనుకుంటే నేను కవినీ కాదు. మరి నువ్వెవరివి అంటారా? అద్గదీ... ఇప్పుడు దొరికింది.

నేను.
C/o amma.

మనిషి.
C/o అమ్మ.

అసలు సృష్టికే మూలకారణం అమ్మ. అందుకే అమ్మ నా ఊపిరి. నీ ఊపిరి. మనందరి ఊపిరి.

దేవుడు అందరి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. నాకు మళ్ళీ అర్ధం కాలేదు. అసలు దేవుడంటే సర్వ శక్తిమంతుడు అంటారు కదా? మరి ఆయన అందరి వద్దా ఉండలేడా? ఆలోచనే ఫూలిష్నెస్స్. మరి అమ్మ ఎందుకు? ఆలోచించాల్సిన ప్రశ్నే!

నాకిప్పుడు భయం వేస్తోంది. మళ్ళీ కళ్లు మూసుకున్నాను. కరంట్ పోయింది. భయంకరమైన చీకటి. ఏంచేయాలో తోచలేదు. ఏమిచేయాలి? చీకటిని తొలగించాలంటే వెలుతురు కావాలి. మరి ఆ వెలుగెవరు? ఆ వెలుగు అమ్మే!

ఎందుకంటే నీ బ్రతుకుని నిర్దేశించేది అమ్మే!

ముందొక మాట చెప్పాలని ఉంది.

రాముడు అడవికి వెళుతున్నాడు. సీతమ్మనీ తనతో తీసుకుని వెళుతున్నాడు. లక్ష్మణ స్వామీ బయలు దేరాడు. సుమిత్రాదేవి ఏమి చెప్పిందో తెలుసా?

"रामं दशरथं विद्धि
माम विद्धि जनकात्मजा
अयोध्याम अटवीम विद्धि
गाच्छ तातयथा सुखं"

రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజా!
అయోధ్యాం ఆటవీం
విద్ధి
గచ్ఛ తాత యథా సుఖం.

అంటే...

"నాయనా! రాముణ్ణి దశరథుని వలె భావించు. సీతమ్మని నన్ను వలె భావించు. ఆటవిని అయోధ్య వలె భావించు. ఇక్కడి వలెనె సుఖంగా ఉండు."

నాయనా! నువ్వు వెళ్లొద్దు, అనలేదు. నాయనా నీవు లేనిదే నేను ఉండలేను, అనలేదు. కొడుకు గురించి అధైర్య పడలేదు. రాముని గూర్చి అపోహ పడలేదు. అడవిలో నా బిడ్డ ఎలా బ్రతుక గలదు? అనే భయమే లేదు. లక్ష్మణ స్వామి మీద అంత నమ్మకం. తమ్ముడిని తనతో సమానంగా చూసుకుంటాడని రాముని మీద అంత నమ్మకం. అంత ధైర్యం కలది కాబట్టే సుమిత్రాదేవి అంత గొప్ప అమ్మ.

కైక లా అసూయ లేదు. కౌసల్య లా ఆవేశం లేదు. చేయాల్సిన పని మీద దృష్టి అంతే! She lead Lakshmana swami from the front with those cool words.

ఈ మాటలని వ్రాయ గలిగినందుకు వాల్మీకి ఎంత అదృష్టవంతుడు?

ఒక్క మాటలో తన బిడ్డకి లక్ష్య నిర్దేశం చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలా ఆలోచించగాలగాలో చెప్పింది.
"నాయనా! అతవినే అయోధ్య అనుకో. ఆహాహా! అంటే? నువ్వు ఎక్కడ ఉంటే అదే నీ ఊరు. అదే నీ ఇల్లు. నిన్ను నడిపించే అన్నే నీకు పితృ సమానుడు. అన్నా భార్యే నీకు తల్లి లాంటిది. అంటే? అడవి దాటారు. జనపదాల్లోకి వెళ్ళారు. అప్పుడు జనపస్డమే నీకు ఇల్లు. దాటారు. నగరానికి వెళ్ళారు. అదే నీ ఇల్లు. ఎక్కడికైనా వెళ్ళు. ప్రదేశం నీదే! ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఉంటుంది కనుక. ఎలా? అమ్మంటే నీ ఊపిరే కదా! నీ ఊపిరి ఎక్కడ ఉంటే అక్క అమ్మ ఉన్నట్లే! ఎలా? శ్వాసని నీకు ఇచ్చింది అమ్మే కదా!"

ఎంత బాగా చెప్పింది? వసుధైక కుటుంబం.

అంతేనా?

అమ్మ చేతి ముద్ద కమ్మన అంటారు. ఛా! నిజమా?

ఒకటి మాత్రం నాకు తెలుసు. మనం తినే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో వాటి ప్రభావం ఆ ఆహారం మీద ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు వండింది తినకూదదంటారు. అలాగే నా మాటేంటంటే, తినే వారి ఆలోచనలు కలిపే వారి చేతి ద్వారా ఆహారం లో ప్రవేసిస్తాయి. మనం తినేటప్పుడు అందుకే అన్నం మీదే దృష్టి పెట్టాలి. కానీ మనం ఆ పని చేయలేం. అదే
అమ్మ మనకి కలిపి పెడుతుంటే? అమ్మంటే నీ శ్వాసే! అమ్మ దృష్టి నీ మీదే! బిడ్డ ఆకలి మీదే! అంటే తనలో అప్పుడు ప్రేమ ప్రొంగి ప్రవహిస్తుంటుంది. ప్రేమ తన చేతుల మీదుగా నీ ఆహారం లోనికి వెళుతుంది. ప్రేమే నీలో కలిసి పోతుంది. ప్రేమే నీ రక్తంలో కలసి పోతుంది. ప్రేమే నువ్వు అవుతుంది. నీ లో నుంచీ ప్రవహిస్తుంది. నీ ప్రేమ అందరినీ చేరుతుంది. ప్రపంచాన్నే ప్రేమ ముంచెత్తుతుంది. అప్పుడు అందరూ నీకు నీ లాగే కనిపిస్తారు. నిన్ను నీవు ద్వేషించ లేవు. అంతటికీ కారణం... 'అమ్మ చేతి ముద్ద'.

ఇప్పుడు చెప్పండి! అమ్మ చేతి ముద్ద కమ్మన అంటూ అమ్మ ప్రేమకు ఒక రుచిని అంటగట్టగలమా? అమ్మ ప్రేమకీ అమ్మతనానికీ ఒక పరిధి నిర్ణయించగలమా?

అమ్మ ప్రేమకి ఒక పరిధి లేనట్టే అమ్మ గురించి చెప్పుకునేందుకు అంతం లేదు. అందుకే మళ్ళీ కలుద్దాం.

అమ్మ కరుణ కలిగింది. క అంటే బ్రహ్మ. రుణ = ఋణం. కలిగింది. బ్రహ్మ ఋణం కలిగింది. అంటే? బ్రహ్మే అమ్మకు రుణ పడి ఉన్నాడు. అమ్మని చేసిన బ్రహ్మే అమ్మకి రుణ పడి ఉన్నాడు.



గీతాచార్య.

3 comments:

ప్రియ October 8, 2008 at 12:47 PM  

సుమిత్రాదేవి గురించి చాలా బాగా చెప్పారు. శ్లోకం ఇవ్వటం నాకునచ్చింది.

"దేవుడు అందరి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. నాకు మళ్ళీ అర్ధం కాలేదు. అసలు దేవుడంటే సర్వ శక్తిమంతుడు అంటారు కదా? మరి ఆయన అందరి వద్దా ఉండలేడా? ఆ ఆలోచనే ఫూలిష్నెస్స్. మరి అమ్మ ఎందుకు? ఆలోచించాల్సిన ప్రశ్నే!"

Very typical of you. Really a good question. Kudos.

అమ్మ చేతి ముద్ద గురించి అయితే నాకు చాలా నచ్చింది. మీ అమ్మ గారు మీకు కలిపి పెడుతారా?;-)

"అమ్మ చేతి ముద్ద కమ్మన అంటారు. ఛా! నిజమా?" ఇలాంటి వాటి వల్ల గొప్ప విషయం పలుచన కావొచ్చు. మీరు ఎ ఉద్దేశ్యంతో వ్రాసినా సరే!

మంచి టపాతో ఆరంభించారు.

వైష్ణవి హరివల్లభ October 8, 2008 at 12:58 PM  

నేను.
C/o amma.

మనిషి.
C/o అమ్మ.

Gr8.

మరువం ఉష June 26, 2009 at 6:19 AM  

తల్లిని ప్రేమించే వ్యక్తికి జగత్తంతా చిన్మయరూపమే. నాదీ మీ లోగిలే, అమ్మకు అభివాదం చేసే వైనాలే...
నా అమ్మకి నా వందనం: అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html
నేనొక అమ్మగా నా మానసం: దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP